సీఎంఆర్ డెలివరీని వేగవంతం చేయాలి
నల్లగొండ : సీఎంఆర్ డెలీవరిని వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు. గురువారం నల్లగొండలోని రెవెన్యూ అదనపు కలెక్టర్ చాంబర్‌లో ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన ఖరీఫ్ 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. ఎఫ్‌సీఐ రేక్ మూమెంట్, స్థలాలు, ఎఫ్‌సీఐ పేమెంట్స్ తదితర అంశాలపై సమీక్షించారు. సీఎంఆర్ డెలివరీని ప్రతిరోజూ డీఎస్‌ఓలు, పౌరసరఫరాల డీఎంలు మిల్లల వారీగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి వారం మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి నాయక్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా డీఎస్‌ఓలు, పౌర సరఫరాల డీఎంలు, రైస్ మిల్లర్లు, సివిల్ సప్లయ్, ఎన్‌పోర్స్‌మెంట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఆర్ అండ్ బీ ఎస్‌ఈ
నల్లగొండ : జిల్లా ఆర్ అండ్ బీ ఎస్‌ఈగా గురువారం విధుల్లో చేరిన ఉన్న మోహన్ నల్లగొండలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ బి.చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా ఇంజనీర్ మోహన్‌కు కలెక్టర్ చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
త్రిపురారం : పాఠ్య పుస్తకాల్లోని కఠిన అంశాలను సైతం విద్యార్థులకు ఉపాధ్యాయులు అర్థమయ్యే రీతిలో సులభంగా బోధించాలని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) సుశీందర్‌రావు సూచించారు. గురువారం త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామ పరిధిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరును పరిశీలించి ఇంగ్లిష్ పుస్తక పఠనం చేయించారు. బోధనా విధానాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట పాఠశాల ఎస్‌ఓ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.


