నల్లగొండ : వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ అవసరాల దృష్ట్యా నల్లగొండ జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం 3:26 గంటల నాటికి జిల్లా విద్యుత్ డిమాండ్ 1,989 మెగావాట్లకు చేరింది. ఇది బుధవారం కంటే 20 మెగావాట్లు, గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే 53 మెగావాట్లు అధికం కావడం గమనార్హం. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) పరిధిలో జీహెచ్‌ఎంసీ (3,728 మెగావాట్లు), మెదక్ (2,057 మెగావాట్లు) తర్వాత నల్లగొండ జిల్లా 1,989 మెగావాట్లతో మూడో స్థానంలో నిలిచింది. అనంతరం మహబూబ్‌నగర్ 1,753 మెగావాట్లు, వికారాబాద్ 358 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో మొత్తం విద్యుత్ డిమాండ్ 10,228 మెగావాట్లుగా నమోదైంది. జిల్లాలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో భూగర్భ జల మట్టాలు కూడా పెరగలేదు. ప్రస్తుతం వరి నాట్ల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు సాగునీటి కోసం ప్రధానంగా బోర్లపై ఆధారపడుతున్నారు. దీంతో వ్యవసాయ పంపుసెట్ల వినియోగం ఒక్కసారిగా పెరిగి విద్యుత్ డిమాండ్ అధికమవుతోంది. జిల్లాలో రానున్న రోజుల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోతే వ్యవసాయ అవసరాల దృష్ట్యా విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విద్యుత్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫ విద్యుత్ వినియోగంలో మూడో స్థానంలో నల్లగొండ


