సమర్థుడి కోసం అన్వేషణ
ఐఏఎస్ అధికారా.. గ్రూప్–1 ఆఫీసరా..
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పోస్టు పదహారు రోజులుగా ఖాళీగా ఉంటోంది. దీంతో పలువురు కమిషనర్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. పదోన్నతుల ద్వారా కమిషనర్లు అయిన వారు నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా రావడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. మొదట ఐఏఎస్ ఆఫీసర్‌ను రప్పించాలనే ఆలోచన చేసినా చిన్న కార్పొరేషన్ అయినందున ఐఏఎస్ అధికారి మున్సి పల్ కార్పొరేషన్‌కు వస్తారా లేక గ్రూప్–1 స్థాయి ఆఫీసర్ వస్తారా అనేది చర్చనీయాంశమైంది.
ఐఏఎస్ స్థాయి అధికారి వస్తే..
నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు రాష్ట్రంలోనే ప్రత్యేకంగా పేరుంది. ఇక్కడ పని చేయాలంటే సమర్థత, మున్సిపాలిటీ వ్యవహారాలపై గట్టి పట్టున్న వారు అయి ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కే సీఆర్ సిద్దిపేట కమిషనర్‌గా పనిచేస్తున్న రమణాచారి లాంటి వ్యక్తిని ఇక్కడికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా మంచి పేరుండి పనిచేసే కమిషనర్ కోసం మంత్రి కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సివిల్స్‌కు సన్నద్ధమై గ్రూప్–1 ఆఫీసర్ పోస్టుకు ఎంపికై న వ్యక్తిని ఇక్కడికి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రం అయినందున ఇక్కడి రాజకీయాలకు అనుగుణంగా కార్పొరేషన్‌ను నడిపించగల శక్తి సామర్థ్యాలు, పాలకవర్గ సమావేశంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సమర్థతతోపాటు నగర సమస్యల పరిష్కారం, అభివృద్ధి తదితర వాటిపై సామరస్యంగా చర్చించే బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు సభ్యులు జాతీయ సమస్యను సైతం ఇటీవల పాలకవర్గ సమావేశంలో లేవనెత్తినా ఇది ఇది మన పరిధిలోని సమస్య కాదని చెప్పకపోవడంతో గందరగోళానికి దారితీసింది. కౌన్సిల్‌లో సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడడానికి గానీ, సిబ్బంది బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినా ఒకవేళ ఐఏఎస్ అధికారి వస్తే సీరియస్‌గానే ఉండే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన వారు సైతం ఇక్కడికి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అందుకు స్థానిక ముఖ్య నాయకులు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. నగరంలో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తున్నందున వాటిని శరవేగంగా పూర్తిచేయగల సమర్ధుడి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయించగలిగే నిజాయితీ గల అధికారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఫైల్స్ పెండింగ్‌లో పడిపోతున్నాయి. నగర పాలనపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫ పదహారు రోజులుగా ఖాళీగా నీలగిరి కార్పొరేషన్ కమిషనర్ పోస్టు
ఫ సమర్థుడిని రప్పించేందుకు మంత్రి కోమటిరెడ్డి ప్రయత్నాలు


