బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
నల్లగొండ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. జనవరి 1వ తేదీ నుంచి నిర్వహించనున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై మంగళవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా తప్పిపోయిన, నిరాధరణకు, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలను గుర్తించి వారి భవిష్యత్‌ను కాపాడే లక్ష్యంతో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే నెల 1 నుంచి 31 వరకు పని ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మూడు డివిజన్ల పరిధిలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గురవుతున్నట్లు, బాల కార్మికులుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 1098, డయల్ 100 కు సమాచారం అందించాలని కోసారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, వివిధ శాఖల అధికారులు అరుణ, హరిత, భిక్షపతి, రంగారెడ్డి, గణేష్ పాల్గొన్నారు.


