పుర పోరుకు అడుగులు | - | Sakshi
Sakshi News home page

పుర పోరుకు అడుగులు

Dec 31 2025 8:38 AM | Updated on Dec 31 2025 8:38 AM

పుర పోరుకు అడుగులు

పుర పోరుకు అడుగులు

రాజకీయ పార్టీల్లో

మొదలైన హడావుడి

మున్సిపాలిటీల వారీగా వార్డులివే..

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల నగారా త్వరలోనే మోగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాతోనే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ఖరారు, పోలింగ్‌ కేంద్రాల ఖరారుకు నోటిపికేషన్‌ విడుదల చేసింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఇప్పటికే మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు అందాయి. గురువారం పోలింగ్‌ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నారు.

11 నెలల కిందటే ముగిసిన

పాలక వర్గాల గడువు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిల్లో నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌ మున్సిపాలిటీ మినహా మిగతా 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 2020 జనవరి 22వ తేదీన మున్సిపల్‌ ఎన్నికలు జరగ్గా, వాటి ఫలితాలు అదే నెల 25వ తేదీన వెలువడ్డాయి. అదే నెల 28వ తేదీన కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ ఏడాది జనవరి 27వ తేదీతోనే పాలకవర్గాల కాలపరిమితి ముగిసింది. అప్పటి నుంచి మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 11 నెలల తరువాత ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభమైంది.

అసెంబ్లీ ఓటర్ల జాబితాతోనే

మున్సిపల్‌ ఎన్నికలు

అసెంబ్లీ ఓటర్ల జాబితాతోనే ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించనుంది. 2023 అక్టోబరు1 నాటికి ఉన్న ఓటర్ల జాబితాల ఆధారంగా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పొటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మున్సిపల్‌ కమిషనర్లు మంగళవారం వార్డుల వారీగా పోలింగ్‌ స్టేషన్ల డేటా విభజించారు. బుధవారం పోలింగ్‌ కేంద్రాలు ఖరారు చేయడంతో పాటు ఆయా కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఇక జనవరి 1వ తేదీన వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురణతో పాటు అభ్యంతరాల స్వీకరణను ఆ రోజు నుంచి 4వ తేదీ వరకు చేపట్టనున్నారు. 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపాలిటీల్లో, 6వ తేదీన జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు.10వ తేదీన తుది ఓటర్ల జాబితాలను ప్రకటిస్తారు. ఆ ఓటర్ల జాబితా ఆధారంగానే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేస్తారని రాజకీయ పార్టీల నేతలు భావించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

18 మున్సిపాలిటీలకే ఎన్నికలు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఉంటే 18 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 2011 ఆగస్టు 24వ తేదీన మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న నకిరేకల్‌ను ఆరు గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ విలీన గ్రామాల ప్రజలు మున్సిపాలిటీ నుంచి తమ గ్రామాలను తొలగించాలని కోర్టుకు వెళ్లారు. 2013 సెప్టెంబర్‌ నెలలో విలీన గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగించడమే కాకుండా, ఆ మున్సిపాలిటీని రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత నకిరేకల్‌ మేజర్‌ గ్రామ పంచాయతీగా కొనసాగింది. 2015లో గ్రామ పంచాయతీకి ఎన్నికలు కూడా నిర్వహించింది. అయితే ఆ తర్వాత 2020 డిసెంబరు 16వ తేదీన మళ్లీ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 2021 ఏప్రిల్‌ 30వ తేదీన మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. అదే సంవత్సరం మే 7న కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ప్రస్తుతం ఆ పాలక వర్గమే 2026 మే 6వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల పరిధిలోని 407 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మున్సిపల్‌ ఎన్నికలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వం ముందు మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. దీంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. పోటీ చేయాలనుకున్న వారంతా ఎన్నికల కోసం సిద్దమవుతుండటంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది.

మున్సిపాలిటీ వార్డులు

మిర్యాలగూడ 48

హాలియా 12

దేవరకొండ 20

భూదాన్‌పోచంపల్లి 13

చిట్యాల 12

నల్లగొండ 48

సూర్యాపేట 48

మోత్కూర్‌ 12

భువనగిరి 35

ఆలేరు 12

చండూరు 10

నేరేడుచర్ల 15

హుజూర్‌నగర్‌ 28

తిరుమలగిరి 15

కోదాడ 35

నందికొండ 12

యాదగిరిగుట్ట 12

చౌటుప్పల్‌ 20

ఫ 18 మున్సిపాలిటీలు..

407 వార్డులకు ఎన్నికలు

ఫ అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితాతోనే..

ఫ పోలింగ్‌ కేంద్రాల సమాచారాన్ని ఖరారు చేసిన మున్సిపల్‌ కమిషనర్లు

ఫ రేపు ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement