యూరియా పంపిణీలో ఇబ్బందులు కలగొద్దు
నల్లగొండ : యాసంగి సీజన్‌కి సంబంధించి యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. యూరియా సరఫరా, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై మంగళవారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతులకు ఎంతో సౌకర్యంగా ఉందన్నారు. ఈ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వానాకాలం ధాన్యం సేకరణపై సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, దేవరకొండ ఆర్‌డీఓ రమణా రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేష్, జ్యోతి పాల్గొన్నారు.
ఓటరు జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి
ఓటరు జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా కచ్చితమైన డేటాతో మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ, మండల పట్టణ స్థాయిలో ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి, ఫీల్డ్ లెవల్‌లో గుర్తించిన వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని సూచించారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు
గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 22, 2026న నిర్వహించనున్న ఉమ్మడి గురుకుల ప్రవేశపరీక్షకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ కోరారు. టీజీ సెట్– 2026 పోస్టర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రవేశపరీక్షకు జనవరి 21 లోగా tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ హొక్షపతి, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్, సంక్షేమ అధికారులు చత్రునాయక్, శశికళ పాల్గొన్నారు.


