
బుద్ధవనం ప్రాజెక్టు అద్భుతంగా ఉంది
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టు అద్భుతమని అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలోని వియత్నాం బౌద్ధవిహార ఆచార్యులు థామ్ కొనియాడారు. బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి బుధవారం హ్యూస్టన్‌లోని బుద్ధవిహారాన్ని, మూడంతస్తుల పగోడాను, 72అడుగుల ఖ్యాన్ ఆమ్ బోధిసత్వ విగ్రహాన్ని సందర్శించారు. బౌద్ధ ఆచార్యులను కలిసి కృష్ణాతీరంలోని బౌద్ధ వారసత్వ స్థలాలు, బుద్ధవనం గురించి వివరించారు. బుద్ధవనంకు సంబంధించిన వీడియోను చూపించారు. కట్టడాలు, శిల్పాలు ఆచార్య నాగార్జునుని స్ఫూర్తిని ఈ తరానికి తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా థామ్ మాట్లాడుతూ.. తాను నాగార్జునకొండను సందర్శించాలని అనుకుంటున్నానని తెలిపారు. ఆచార్య నాగార్జునుడి రచనలను బుద్ధవనం ద్వారా ఈ తరానికి తెలియ జెప్పే కార్యక్రమాలను రూపొందించాలని బౌద్ధాచార్యులు సూచించారని, ఈ విషయాన్ని తాను బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు తెలియజేయనున్నట్లు శివనాగిరెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ బౌద్ధ క్షేత్రాల గురించి అమరావతి శిల్పకళ ప్రత్యేకత, కృష్ణాతీరం నుంచి శ్రీలంక ద్వారా బౌద్ధం దక్షిణాసియా దేశాలకు చేరిందని వియత్నాం బౌద్ధ విహార ఆచార్యులుకు వివరించినట్లు శివనాగిరెడ్డి చెప్పారు.
కొనియాడిన అమెరికాలోని హ్యూస్టన్ బౌద్ధవిహార ఆచార్యులు థామ్