యూరియా ఏదయా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాథమిక సహకార సంఘాలకు కేటాయించిన యూరియా నిల్వలు వెంటనే ఖాళీ అవుతున్నాయి. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇచ్చినా.. అందరికీ అందడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేట్ డీలర్లు ఇదే అదనుగా భావించి ఒక్కో బస్తాపై రూ.50కి పైగా అదనంగా వసూలు చేయడమే కాకుండా ఇతర పురుగు మందులను అంటగడుతున్నారు. మరోవైపు యూరియా కొరత కారణంగా మళ్లీ దొరకదేమో అనే ఆందోళనతో రైతులు ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
కేటాయింపు ఎక్కువ.. సరఫరా తక్కువ
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు 10,60,650 ఎకరాల్లో వివిద పంటలను రైతులు సాగు చేశారు. అందులో వరి 4,07,350 ఎకరాల్లో, పత్తి 5,59,640 ఎకరాల్లో, మిగతా కంది, పెసర, ఇతర మెట్ట పంటలను సాగు చేశారు. సీజన్‌లో పత్తి, వరి పంటకు రైతులు యూరియాను వినియోగిస్తున్నారు. జిల్లాకు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం అలాట్ చేసింది. కానీ, అందులో 44,500 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే జిల్లాకు సరఫరా అయింది. దీనిలో వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలకు 24 వేల మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 20,500 మెట్రిక్ టన్నుల కేటాయించారు. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు యూరియాను రైతులు వెంటవెంటనే కొనుగోలు చేస్తుండడంతో అక్కడ నాలుగైదు రోజుల్లోనే యూరియా ఖాళీ అయ్యింది.
వర్షాలు పడుతుండటంతో పెరిగిన డిమాండ్
జిల్లాలో కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటం, వరి నాట్లు ఊపందుకోవడంతో పత్తి, వరి చేలకు యూరియా వినియోగం ఒక్కసారిగా పెరిగింది. రైతులు సీజన్ ఆరంభానికి ముందే యూరియాను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడంతో పాటు యూరియా వాడకం మోతాదును పెంచుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యూరియా కేటాయింపులో కోత విధిస్తోంది. ఈ కారణంగా జిల్లాలో యూరియా కొరత తీవ్ర అవుతోంది.
మెజారిటీ పీఏసీఎస్‌లలో కొరతే
● చిట్యాల పీఏసీఎస్‌లో ప్రస్తుతం యూరియా అందుబాటులో లేదు. ఇప్పటివరకు రైతులకు ఎకరాకు రెండు బస్తాల చొప్పున యూరియాను మాత్రమే ఇచ్చారు. మండలంలో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 2500 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది.
● నాంపల్లి మండలంలో పీఏసీఎస్‌ల్లో యూరియా లేకపోవడంతో ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో బస్తాకు రూ.360 నుంచి రూ.400 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
● గట్టుపల్ మండలానికి 180 టన్నులు రాగా, ఇంకా అవసరముందని పది రోజుల కిందట ఇండెంట్ పెట్టి నగదు చెల్లించినా ఇంతవరకు అందలేదు.
● తిప్పర్తి, వేములపల్లి, పెద్దవూర మండలాల్లోనూ అధిక కొరత ఉంది.
● అనుముల మండలానికి 4 వేల మెట్రిక్ టన్నులు అవసరమైతే 1200 మెట్రిక్ టన్నులే వచ్చింది. ఒక్క కొత్తపల్లి పీఏసీఎస్‌కు వచ్చిన యూరియా వెంటనే అయిపోయింది. ఇక్కడ ఎకరానికి ఒక బస్తా మాత్రమే ఇచ్చారు. 120 మెట్రిక్ టన్నుల యూరియా కోసం డీడీ చెల్లించినా ఇంతవరకు రాలేదు.
● మునుగోడుకు వారం కిందట వచ్చిన యూరియా వెంటనే అయిపోయింది. మళ్లీ ఇప్పటివరకు రాలేదు.
● కనగల్, నిడమనూరు మండలాల్లోని పీఏసీఎ స్‌లలో వారం రోజులుగా, మాడులపల్లి సొసైటీల్లో నాలుగు రోజులుగా యూరియా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఫ సహకార సంఘాల్లో వెంటనే ఖాళీ అవుతున్న నిల్వలు
ఫ ఫర్టిలైజర్ షాపుల బాట పట్టిన రైతులు
ఫ బస్తాకు రూ.50 అదనం.. పురుగు మందులూ కొనాలని షరతు
ఫ మళ్లీ దొరకదేమోనని అవసరానికి మించి యూరియా కొనుగోలు
వ్యవసాయేతర అవసరాలకు యూరియా వాడొద్దు
నల్లగొండ : వ్యవసాయేతర అవసరాలకు యూరియా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం ఆమె నల్లగొండలోని ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణాన్ని, గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరం లేనిచోట యూరియా డంప్ చేయవద్దని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే యూరియా అమ్మాలన్నారు. యూరియా, ఎరువుల సక్రమ సరఫరా కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆమె వెంట నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఉన్నారు.
యూరియా ఏదయా!


