45 శాతం అధిక వర్షం
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు జిల్లాలో సాధారణం కంటే 45 శాతం అధిక వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా 20 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జూలై చివరి వరకు జిల్లాలో లోటు వర్షపాతం నమోదవగా.. ఆగస్టు తొలి వారం నుంచి జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిసి అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు 276 మిల్లీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా.. 399 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
12 మండలాల్లో అత్యధికం
జిల్లాలోని 12 మండలాల్లో అత్యధికంగా, 10 మండలాల్లో అధికంగా, 11 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. శాలిగౌరారం, మర్రిగూడ, చింతపల్లి, గుర్రంపోడు, అడవిదేవులపల్లి, పెద్దవూర, పీఏపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ, గుడిపల్లి, చందంపేట, మండలాల్లో అత్యధిక వర్షం కురిసింది. చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, కనగల్, అనుముల, హాలియా, మాడ్గులపల్లి, దామరచర్ల, తిరుమలగిరి సాగర్, నేరడుగొమ్ము మండలాల్లో అధిక వర్షం కురిసింది. కేతేపల్లి, తిప్పర్తి, నల్లగొండ, మునుగోడు, చండూరు, నాంపల్లి, నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి, మిర్యాలగూడ, గట్టుప్పల్ మండలాల్లో సాధారణ వర్షం కురిసింది.
ఊపందుకున్న వరి నాట్లు..
అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరి నాట్లు ఊపందుకున్నాయి. వారం క్రితం వరకు 2.50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ప్రస్తుతం వర్షాలకు తోడు నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ, మూసీ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు రావడంతో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,07,465 ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు మరో లక్ష ఎకరాల్లో రైతులు నాట్లు వేసుకునే అవకాశం ఉంది.
ఫ జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు
ఫ ఇప్పటి వరకు కురవాల్సింది 276 మి.మీ కురిసింది 399 మి.మీ


