పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
నల్లగొండ : ప్రజలంతా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె నల్లగొండ పట్టణంలో గతేడాది ఏఆర్‌నగర్‌లో ఎక్కువ డెంగీ కేసులు నమోదైన ఏఆర్‌నగర్‌లో పర్యటించారు. వార్డు పరిసరాలు, డ్రెయినేజీలు, ఇళ్లను పరిశీలించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను గమనించారు. వార్డుల్లో ఓపెన్ డ్రెయినేజీలను మూసి వేయాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్‌ను ఆదేశించారు. వార్డులో నిర్వహిస్తున్న జ్వర సర్వే వివరాలను మలేరియా సిబ్బంది మాట్లాడి తెలుసుకున్నారు. డాక్టర్లు వచ్చారా? రక్తం నమూనాలు తీసుకున్నారా? అని ఇళ్ల యజమానులను అడిగారు.
లైన్‌వాడ ఆస్పత్రి తనిఖీ
నల్లగొండ పట్టణంలోని లైన్‌వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉన్న మందులు, నమోదైన హైరిస్క్ కేసులు, ప్రసవాల నమోదు, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల ఈడీడీ కేసులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. లైన్‌వాడ వార్డులో జనాభా ఎక్కువగా ఉన్నందున ఇక్కడ మరో పట్టణ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్, డాక్టర్ ఇంతియాజ్, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలను నిర్మూలించాలి
జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో మత్తుమందుల నివారణ జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత మత్తు మందులకు బానిస కాకుండా అన్ని స్థాయిలలో అవగాహన కల్పించాలన్నారు. నల్లగొండను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చాలన్నారు. పాఠశాలలు, కళాశాలెకల మాదకద్రవ్య నిర్మూలన కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ అతివేగం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ను కోరారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏసీపీ మౌనిక, ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి


