పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి
నల్లగొండ : పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు తెలుసుకుని.. కేసుల ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు రోజూ గ్రామానికి వెళ్లి ప్రజలతో మమేకం అవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. రానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్‌రాజు, రవికుమార్, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.


