
గోదాములు ఫుల్!
వానాకాలం ధాన్యం వచ్చే నాటికి ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగిస్తే మిల్లుల్లో ఖాళీ ఉంటుంది. దాంతో కొత్తగా వచ్చే ధాన్యం నిల్వ చేసుకోవచ్చు. ప్రైవేట్ గోదాములు తీసుకుని అయినా సీఎంఆర్ సేకరణ వేగవంతం చేయాలి.
– కర్నాటి రమేష్, మిల్లర్స్
అసోసియేషన్ అధ్యక్షుడు
జిల్లాలోని గోదాముల్లో 4.05 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉంది. ఇప్పటి వరకు 3.90 లక్షల మెట్రిక్‌టన్నుల బియ్యం నిల్వలున్నాయి. ప్రస్తుతం ర్యాక్‌లు వచ్చిన వెంటనే ఇక్కడి బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి మిల్లర్ల నుంచి సీఎంఆర్ తీసుకుంటాం.
– సువిన్‌కుమార్, ఎఫ్‌సీఐ డీఎం
నల్లగొండ : బియ్యం నిల్వలతో జిల్లాలోని ఎఫ్‌సీఐ గోదాములన్నీ నిండిపోయాయి. గోదాముల్లో ఖాళీ లేక మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ గోదాముల్లో ఇప్పటికే బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో గత యాసంగి సీఎంఆర్ తీసుకునే విషయంలో ఆలస్యమవుతోంది. దీంతో మిల్లులోనే ఉన్న ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని మిల్లర్లు అంటున్నారు.
ఎఫ్‌సీఐకి ఇచ్చేది బాయిల్డ్ బియ్యమే..
జిల్లాలో నల్లగొండతో పాటు మిర్యాలగూడ, తిప్పర్తి, పెద్దకాపర్తి పరిధిలో ఎఫ్‌సీఐ గోదాములు ఉన్నాయి. ప్రతి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్ కింద పౌర సరఫరాల శాఖకు, ఎఫ్‌సీఐకి ఇస్తారు. పౌర సరఫరాల శాఖకు ఇచ్చే సన్న బియ్యం హాస్టళ్లు, రేషన్ షాపులకు వెళ్తుంది. ఎఫ్‌సీఐ మాత్రం యాసంగి ధాన్యానికి సంబంధించి బాయిల్డ్ బియ్యం తీసుకుంటుంది.
ఇవ్వాల్సిన సీఎంఆర్ 2,24,915 టన్నులు
యాసంగి సీజన్‌లో మొత్తం 6.03 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని మిల్లులకు ఇవ్వగా.. 4,07,300 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. అందుకు సంబంధించి ఇప్పటి వరకు 1,82,618 మెట్రిక్ టన్నులు మాత్రమే సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐ తీసుకుంది. ఇంకా 2,24,915 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రోజూ 1,500 టన్నుల బియ్యం తీసుకుంటున్నారు.
ఉన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తేనే..
జిల్లాలోని గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ఎఫ్‌సీఐ ఇతర రాష్ట్రాలకు తరలిస్తేనే మిల్లర్ల నుంచి బియ్యం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వానాకాలం పంట సాగవుతోంది. ఆ దిగుబడి రాకముందే జిల్లాలో మిల్లర్ల నుంచి సీఎంఆర్ తీసుకుంటే మిల్లుల్లో ఉన్న ధాన్యం ఖాళీ అవడంతో కొత్తగా వచ్చే ధాన్యం నిల్వ చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రైవేట్ గోదాములనైనా అద్దెకు తీసుకుని మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫ సీఎంఆర్ దిగుమతికి స్థలం కరువు
ఫ మిల్లుల్లోనే మగ్గుతున్న ధాన్యం
ఫ రంగుమారే ప్రమాదం ఉందంటున్న మిల్లర్లు