నల్లగొండ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం నల్లగొండకు రానున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 9.30 గంటలకు ఆర్జాలబావిలో, 10.30 గంటలకు తిప్పర్తిలో ధాన్యం కొనుగోలలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నల్లగొండ నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు.
రైతు సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలం
చింతపల్లి : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ విమర్శించారు. ఆదివారం చింతపల్లిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా 15వ మహాసభలో ఆమె మాట్లాడారు. భూమి, భుక్తి, రైతు సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నడిపిన చరిత్ర తెలంగాణ రైతు సంఘానికి ఉందన్నారు. దేశంలో వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం కోసం స్వామినాథన్ కమిషన్ సూచనలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఎండీ.మోహినుద్దీన్, కార్యదర్శి గిరిజ రామచంద్రయ్య, సుదర్శన్‌రెడ్డి, పోలె వెంకటయ్య, ఉజ్జిని అంజల్‌రావు పాల్గొన్నారు.
ఆర్థిక పరిస్థితి
బాగలేదనడం సరికాదు
నల్లగొండ : ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విషయం తేల్చకుండా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదనడం సరికాదని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పీఆర్‌సీ గడువు ముగిసిందని, పీఆర్‌సీ రిపోర్టు వెంటనే తీసుకుని అమలు చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి కేవలం 7.57 శాతం కేటాయించడం సరికాదన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పి.వెంకులు, ఉపాధ్యక్షుడు పి.ఏడుకొండలు, ఎం.పుష్పలత, ఎన్.గోపి, ఎం.నాగయ్య, టి.వెంకటేశ్వర్లు, జగతి, రాహెల్‌కుమారి, అంజయ్య, ఖుర్షిద్‌మియా పాల్గొన్నారు.
ఫ్లెక్సీ మెటీరియల్‌పై
పన్నులు రద్దుచేయాలి
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీ మెటీరియల్‌పై వేసిన పన్నులను రద్దు చేయాలని ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్‌రెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్లెక్సీ, ప్రింటింగ్ యజమానులను కాపాడాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు చిలుకూరి జగన్నాథ్ మాట్లాడుతూ రెండు రోజులుగా షాపులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రింటింగ్ రేట్లు పెంచక తప్పడం లేదన్నారు. కార్యక్రమంలో కల్లూరి నగేష్‌గౌడ్, రామగిరి వెంకన్న, సురేష్, చంద్రశేఖర్, సిరాజుద్దీన్, శ్రీధర్, హరీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన
నేడు నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన