నకిరేకల్: పేపర్ లీకేజీతో సమస్యత్మకంగా మారిన నకిరేకల్ పట్టణంలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ పహారా నడుమ శనివారం పరీక్షలు జరిగాయి. పట్టణంలోని నాలుగు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసులు పహారా కాశారు. ప్రత్యేకించి శుక్రవారం ప్రశ్నపత్రం లీకేజీ అయిన ఎస్సీ గురుకుల సెంటర్‌కు చీఫ్ సూపరింటెండెంట్‌గా నకిరేకల్ మండలం మంగళపల్లి జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం వీరారెడ్డి, డిపార్ట్‌మెంటల్ అధికారిగా కట్టంగూరు మండలం మునుకుంట్ల జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం షమీదాబేగంను నియమించారు. ఈ కేంద్రంలో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్, నల్లగొండ ఎంఈఓ అరుంధతి మకాం వేసి పర్యవేక్షించారు. నకిరేకల్ తహసీల్దార్ జమురుద్దీన్, ఎంఈఓ నాగయ్య పరీక్ష కేంద్రాలను సందర్శించారు. నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐలు సురేష్, లచ్చిరెడ్డి సిబ్బందితో గస్తీ నిర్వహించారు. నాలుగు కేంద్రాల్లో మొత్తం 747 మంది విద్యార్థులకు గాను 745 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇద్దరు గైర్హాజరయ్యారు.
షోకాజ్ నోటీసులు జారీ..
నకిరేకల్‌లో గురుకల పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌గా ఉన్న పోతులు గోపాల్, డిపార్ట్‌మెంటల్ అధికారి రామ్మోహన్‌రెడ్డిని శుక్రవారమే విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ శనివారం వారికి జిల్లా విద్యాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పేపర్ లీక్ అయిన గది ఇన్విజిలేటర్‌గా ఉన్న ఇదే గురుకుల పాఠశాలలో టీజీటీ సుధారాణిని శుక్రవారమే సస్పెండ్ చేశారు.