నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌డేలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 35 మంది అర్జిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
675 మంది గైర్హాజరు
నల్లగొండ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 675 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన ఫస్టియర్ పిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 15,316 మంది విద్యార్థులకు హాజరుకావాల్సి ఉండగా 14,641 మంది హాజరయ్యారు. 675 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : డీఈఓ
నల్లగొండ : మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 105 రెగ్యులర్ కేంద్రాలను, 3 ప్రైవేట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 18,666 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి
నల్లగొండ టూటౌన్: రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కోతలు నివారించి రైతుల పంటలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశామన్నారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరానికి రూ. 30 వేల నష్టపరిహారం ఇవ్వాలని, వరి కోతలు మొదలైనందున ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి, గడ్డం వెంకట్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, గుండా నవీన్ రెడ్డి, సాయన్న గౌడ్, మాలె వెంకట్‌రెడ్డి, పాదూరి వెంకట్‌రెడ్డి, పిండి పాపిరెడ్డి, జవ్వాది సత్యనారాయణ, రవి ఉన్నారు.
శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : శివకేశవులకు నిలయమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఆధ్యాత్మిక పర్వాలు కొనసాగాయి. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో రుద్రాభిషేకం, బిల్వార్చనలు, ముఖమండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవల, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూలు చేపట్టారు.