లైనింగ్‌కు మోక్షం
113 కిలోమీటర్ల మేర లైనింగ్
ఏఎమ్మార్పీ
ప్రధానకాల్వ
గుర్రంపోడు : ఎలిమినేటి మాదవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ప్రధాన కాల్వ లైనింగ్ పనుల్లో ముందడుగు పడింది. లైనింగ్ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థతో అగ్రిమెంట్ పూర్తయింది. ఏఎమ్మార్పీ లైనింగ్ పనులకు మే నెలలో ప్రభుత్వం రూ.442 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసి.. టెండర్లు పిలిచింది. రూ.339 కోట్లకు ఓ కంపెనీ టెండర్ దక్కించుకుంది. నాలుగేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. ప్రస్తుతం నీటి విడుదల జరుగుతున్నందున యాసంగి సీజన్ ముగియగానే వేసవిలో పనులు ప్రారంభించేలా కంట్రాక్టు సంస్థ సన్నద్ధమవుతోంది. ముందస్తుగా త్వరలో కంపచెట్ల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. జనవరి నెలలో సీఎం చేతుల మీదుగా లైనింగ్ పనులు ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
చివరి భూములకు అందని నీరు
ఏఎమ్మార్పీ కాల్వ చివరి భూములకు నీరు అందకపోవడానికి కారణం ప్రధాన కాల్వతోపాటు ఏ మేజర్‌కు సీసీ(సిమెంట్ కాంక్రీట్) లైనింగ్ లేకపోవడమే. మూడు దశాబ్దాలుగా సీసీ లైనింగ్ లేకుండా నీరు అందిస్తున్నారు. ప్రధానకాల్వకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే కోతకు గురైన గండ్లు పడే ప్రమాదం ఉండటంతో 3 వేల క్యూసెక్కులకుగాను కేవలం 1200 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. దీంతో చివరి భూములు బీళ్లుగా మారుతున్నాయి.
మేజర్ల లైనింగ్ ప్రతిపాదనలు పెండింగ్
డిస్ట్రిబ్యూటరీల్లో 50 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండి ఎక్కువ ఆయకట్టు గల ప్రధానమైన డి–19, డి–22, డి–25 మేజర్లకు లైనింగ్ పనులకు రూ.150 కోట్లతో ఇప్పటికే పంపిన ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క డి–25 మేజర్ కింద 23 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ నిధులు కూడా మంజూరైతే ప్రధాన మేజర్లకు లైనింగ్ జరిగి పూర్తిస్ధాయిలో ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది.
కాల్వ వెడల్పు చేయాలని డిమాండ్
ప్రస్తుతానికి ప్రధాన కాల్వ సీసీ లైనింగ్ పనులకే పరిమితంగా కాగా జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి కాల్వ వెడల్పునకు డిమాండ్ వస్తుండడంతో.. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రధాన కాల్వను మూడు వేల క్యూసెక్కులకు సరిపడా డిజైన్ చేశారు. అప్పట్లో 2.20 లక్షల ఆయకట్టుతో డిజైన్ చేయగా.. ప్రస్తుతం బ్రహ్మణవెల్లంల, ఉదయ సముద్రం, అయిటిపాముల ప్రాజెక్టులు వచ్చాయి. వీటి ఆయకట్టు 1.10 లక్షలు ఉంది. తొలుత ఆరుతడి పంటలకే కాల్వను డిజైన్ చేయగా.. ఇప్పుడు వరిసాగే ఎక్కువగా జరుగుతోంది. అన్నింటికి మూడు వేల క్యూసెక్కులు సరిపోవు. దీంతో ప్రధాన కాల్వను మరో ఆరు మీటర్ల వెడల్పు పెంచి లైనింగ్ పనులు చేపట్టాలనే డిమాండ్ ఉంది. పనులు ప్రారంభమయ్యేలోగా కాల్వ వెడల్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
136 కిలోమీటర్ల ప్రధాన కాల్వ పొడవునా 55 మేజర్ల ద్వారా 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్లగొండ పట్టణంతోపాటు హైదరాబాద్‌కు నీరందించే కోదండాపురం నీటి శుద్ధి కేంద్రానికి తాగునీరు ఏఎమార్పీ నుంచే అందాల్సి ఉంది. ఏఎమార్పీ ప్రధానకాల్వ కామన్ పాయింట్ 23.500 కిలోమీటర్ల నుంచి మూసీ వరకు గల 136.150 కిలోమీటర్ వరకు 113 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వకు సిమెంట్ కాంక్రీట్ చేయనున్నారు. యాసంగి నీటి విడుదల ముగిసేలోగా కన్‌స్ట్రక్షన్ కంపెనీ క్యాంపు కార్యాలయాల ఏర్పాటు, సామగ్రిని సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేపట్టే అవకాశం ఉంది. ఆంధ్రా పాంతంలో పలు ప్రాజెక్టుల లైనింగ్ పనులు చేసిన అనుభవం ఇక్కడి లైనింగ్ పనులు దక్కించుకున్న కంపెనీకి ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ రూ.339 కోట్లకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ
ఫ పూర్తయిన అగ్రిమెంట్
ఫ యాసంగి సీజన్ ముగియగానే ప్రారంభం కానున్న పనులు
ఫ నాలుగేళ్లలో పనులు పూర్తి చేసేలా లక్ష్యం
ఫ కాల్వ వెడల్పుపై స్పష్టత కరువు
లైనింగ్‌కు మోక్షం


