జీవాల ఆరోగ్యం పదిలం
ఈ నెల 31వ తేదీ వరకు జీవాలకు నట్టల నివారణ మందు తాగిస్తాము. లక్ష్యాన్ని నూరుశాతం పూర్తి చేస్తాం. పెంపకం దారులంతా తమ జీవాలకు నట్టల మందును తాగించాలి. గ్రామాలకువచ్చే పశువైద్య సిబ్బందికి సహకరించాలి.
– డాక్టర్ జీవీ రమేష్,
జిల్లా సంవర్థక శాఖ అధికారి
నల్లగొండ అగ్రికల్చర్ : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాగించే కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. జీవాల్లో నట్టలను నివారించడానికి జిల్లా పశువైద్య సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు నట్టల నివారణ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో 10 లక్షల గొర్రెలు, 3 లక్షల మేకలు ఉన్నట్లు జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాటికి మందు తాగించడానికి 250 మందితో 78 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఉదయం 8 గంటలకే మందల వద్దకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటల వరకు మందును తాగిస్తున్నాయి. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 60 శాతం జీవాలకు నట్టల నివారణ మందును తాగించారు. ఈ నెలఖరు నాటికి నూరు శాతం మందును తాగించే కార్యక్రమాన్ని పూర్తి చేసేలా జిల్లా పశు వైద్య సంవర్థక శాణ ముందుకు సాగుతోంది.
మందు తాగించడం వల్ల ప్రయోజనాలు
జీవాలైన గొర్రెలు, మేకల్లో నులిపురుగులు, కార్జపు జలగలు, పొట్ట జలగలు, బద్దె పురుగులు మొదలైనవి ఉండడం వల్ల జీవాలు నీరసించిపోతాయి. దీని కారణంగా పెరుగుదల మందగించడం, రక్తహీనత, ఎదకురాకపోవడం, బలహీనమైన పిల్లలు జన్మించడం, ఇతర వ్యాధుల బారిపడుతాయి. నట్టల నివారణ మందును తాగించడం వల్ల అంతర పరాన్న జీవులు చనిపోయి జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పెరుగుదల బాగుండి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు కూడా సోకవు
ఫ జిల్లాలో ముమ్మరంగా నట్టల నివారణ కార్యక్రమం
ఫ గొర్రెలు, మేకలకు మందు తాపిస్తున్న పశువైద్య బృందాలు
జీవాల ఆరోగ్యం పదిలం


