కట్టంగూర్: పంట వ్యర్ధాలతో బయోచర్‌ను ఉత్పత్తి చేసి వినియోగించుకుంటే పంట దిగుబడి పెరగడంతో పాటు మట్టిలో నాణ్యత పెరుగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలో తపోవనం బయోచర్ ఫ్యాక్టరీలో పంటల వ్యర్థాలతో తయారుచేస్తున్న బయోచర్(జీవ బొగ్గు)ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బయోచర్ గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆక్సిజన్ లేకుడా పత్తి కట్టెను, వరి గడ్డితో పాటు ఇతర పంట వ్యర్ధ్థాలను వేడి చేసి కట్టెలో సేంద్రీయ కర్బనం నిల్వ చేయడం ద్వారా బయోచర్ ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలోని పొలాల్లో ప్రస్తుతం 0.3 శాతం కంటే ఎక్కువ కర్బనం లేదన్నారు. బయోచర్ వాడకం వల్ల పొలంలో ఒక శాతం కర్బనం పెరిగి అధిక దిగుబడులు వస్తాయని, రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని తెలిపారు. బయోచర్ సంస్థ వృథా వ్యర్ధ్థాలను సేకరించి ప్రాసెసింగ్ ద్వారా జీవ బొగ్గుగా మార్చి రైతులకు ఉచితంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై పండ్లు, పూల మొక్కలను తక్కువ ధరలో రైతులకు, ప్రజలకు సరఫరా చేసేందుకు, నర్సరీ పెంచేందుకు స్థలాన్ని కేటాయించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి కలెక్టర్‌ను కోరగా అవసరమైన స్థలాన్ని చూడాలని తహసీల్దార్ ప్రసాద్‌ను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్, జిల్లా పరిశ్రమల అధికారి కోటేశ్వర్‌రావు, నల్లగొండ ఆర్డీఓ యారాల అశోక్‌రెడ్డి, తహసీల్దార్ గుగులోతు ప్రసాద్, కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ స్థాపకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఎఫ్‌పీఓ చైర్మన్ చెవుగోని సైదమ్మ ఉన్నారు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తితో
ఆదాయం పెంచుకోవచ్చు
సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలు ఆదాయాన్ని సృష్టించుకోవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.50లక్షల చెక్కును అందజేయగా స్వయం సహాయక మహిళా సంఘాలు సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ శక్తి కేంద్రం ప్రతినిధి సుధాకర్, మహిళలు తదితరులు ఉన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి