నల్గొండలో యురేనియం ఉందా? ఎందుకింత సెర్చ్‌? | Search for Uranium in Nalgonda forest | Sakshi
Sakshi News home page

నల్గొండలో యురేనియం ఉందా? ఎందుకింత సెర్చ్‌?

Mar 23 2024 1:15 AM | Updated on Mar 23 2024 5:17 PM

సాగర్‌ సమీపంలో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్న గుట్ట - Sakshi

సాగర్‌ సమీపంలో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్న గుట్ట

నాగార్జునసాగర్‌ పరిసరాల్లో నిక్షేపాల అన్వేషణ

10 రోజులుగా యూసీఐఎల్‌ అధికారులు రాకపోకలు

రెండు చాపర్ల ద్వారా ఏరియల్‌ సర్వే

ఆందోళనలో సాగర్‌ పరిసర ప్రాంత ప్రజలు

నాగార్జునసాగర్‌ : నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ మళ్లీ మొదలైంది. కొంతకాలంగా పలువురు శాస్త్రవేత్తలు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌ అతిథిగృహంలో బస చేస్తూ.. నాగార్జునసాగర్‌ రైట్‌బ్యాంక్‌ సమీపంలో ఆంధ్రా వైపున ప్‌లైటెక్‌ ఎరోడ్రమ్‌లో రెండు చాపర్లను పెట్టుకుని ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే వారు ఇతర ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నట్లు చెబుతూ వస్తున్నారు. ఇటీవల కృష్ణా తీరాన తెలంగాణలోగల అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో చాపర్ల ద్వారా సర్వే నిర్వహించారు. పది రోజులుగా యూసీఐఎల్‌ (యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) అధికారులు ఈ ప్రాంతంలో పర్యటిస్తుండటంతో అన్వేషణ కొనసాగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు.

కృష్ణాతీరంలో యురేనియం నిక్షేపాలు

గతంలోనే ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించిన శాస్త్రవేత్తలు వేల ఎకరాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు. పెద్దవూర మండలంలోని పులిచర్ల సమీపంలోగల కేకేతండా వద్ద క్యాంపు ఏర్పాటు చేసుకుని పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టుపై డ్రిల్లింగ్‌ చేసి శాంపిల్స్‌ తీసి శాస్త్రవేత్తలకు పంపేవారు. ఆ విధంగా సంవత్సరాల తరబడి సర్వేలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గుట్టలు, పెద్దమూల గ్రామంలో వెయ్యి హెక్టార్లలో, పెద్దఅడిశర్లపల్లి మండలంలో 1104.64 ఎకరాల అటవీ భూమిలో, 196.71 ఎకరాల పట్టా భూముల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు యూసీఐఎల్‌ అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఇదే ప్రాంతంలోని మల్లాపురంలో రాతినుంచి యురేనియం వేరు చేసే కార్మాగారాన్ని నెలకొల్పేందుకు భూసేకరణ మొదలుపెట్టారు. ఇక్కడ ప్రభుత్వ భూమి లేకపోవడంతో ఈ కర్మాగారాన్ని దేవరకొండ మండలం శేరిపల్లి వద్ద పెట్టేందుకు 200 ఎకరాల భూమిని సేకరించారు. 2003 సంవత్సరంలలో పెద్దఅడిశర్లపల్లిలో ఆనాటి నల్లగొండ కలెక్టర్‌ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారు. ఆ తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో సద్దుమణిగింది.

ప్రజల్లో భయం

యురేనియం వెలికితీతతో రేడియేషన్‌ బయటకు వచ్చి ప్రాణాలకే ప్రమాదం జరుగుతందని ప్రజల్లో భయం ఉంది. ఈ గుట్టల నుంచి వర్షపు నీరంతా నాగార్జునసాగర్‌ జలాశయంలో కలుస్తుంది. ఇక్కడ యురేనియం తీస్తే తాగు, సాగునీరు కలుషితమై ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. దీంతో యురేనియం వెలికితీతను వ్యతిరేకిస్తూ గతంలోనే పెద్ద ఉద్యమాలు చేపట్టారు.

ఏరియల్‌ సర్వేకు వినియోగిస్తున్న చాపర్‌1
1/3

ఏరియల్‌ సర్వేకు వినియోగిస్తున్న చాపర్‌

శాస్త్రవేత్తల కోసం విజయవిహార్‌కు వచ్చిన భారత ప్రభుత్వ వాహనం2
2/3

శాస్త్రవేత్తల కోసం విజయవిహార్‌కు వచ్చిన భారత ప్రభుత్వ వాహనం

గతంలో పెద్దగట్టులోని బోరుబావుల ద్వారా సేకరించిన శాంపిల్స్‌ (ఫైల్‌) 3
3/3

గతంలో పెద్దగట్టులోని బోరుబావుల ద్వారా సేకరించిన శాంపిల్స్‌ (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement