పదేళ్ల తర్వాత వెలుగులోకి.. ఎవరీ నళిని.. అసలు ఆమె కథేంటి? | - | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత వెలుగులోకి.. ఎవరీ నళిని.. అసలు ఆమె కథేంటి?

Dec 31 2023 1:48 AM | Updated on Dec 31 2023 10:26 AM

- - Sakshi

సాక్షి, యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఉద్యమకారులపై లాఠీ ఝుళిపించలేక తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ దోమకొండ నళిని చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఆమె కలిశారు. భువనగిరికి చెందిన నళిని తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2009లో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ఆ పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది.

డిసెంబర్‌ 7న రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నళిని అంశంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమెకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు పెట్టా రు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేసిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల జరిగిన పోలీసు శాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరే దైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని చెప్పారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని నళిని కలిశారు.

కుటుంబ నేపథ్యం ఇదీ..
భువనగిరికి చెందిన దోమకొండ సత్యనారాయణ, సత్యవతి దంపతుల కూతురు నళినికి డిగ్రీ మొదటి చదువుతున్న సమయంలోనే ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆత్మకూరుకు చెందిన నరేందర్‌తో వివాహం జరిగింది. సంతానం అయిన తరువాత కూడా నళిని చదువు కొనసాగించారు. ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి బీఎడ్‌ కూడా చేశారు. గ్రూప్‌–1, గ్రూప్‌–2 పరీక్షలు రాశారు. గ్రూప్‌ –2కు ఎంపిక కావడంతో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగంలో చేరారు. 2007లో గ్రూప్‌–1 రావడంతో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అదే ఏడాది జూన్‌ 1న డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీ శిక్షణ పూర్తయ్యాక హసన్‌పర్తి, హన్మకొండలో ప్రొబేషనరీ డీఎస్పీగా పనిచేశారు. మొదటి పోస్టింగ్‌ కరీంనగర్‌లో ఇచ్చినప్పటికీ, తర్వాత ఆర్డర్‌ను అప్పటి ప్రభుత్వం మార్చి మెదక్‌ డీఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చింది. 2009 డిసెంబర్‌9న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

తెలంగాణ ఉద్యమంపై అప్పట్లో జరిగిన అణచివేత, ఉద్యమకారులపై దాడులకు వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. డీఎస్పీ స్థాయి అధికారి ఉద్యోగానికి రాజీనామా చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. అదే రోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైనట్లుగా అప్పటి కేంద్రం ప్రకటించింది. ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వం దాన్ని ఆమోదించ లేదు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ నళిని 2009 డిసెంబర్‌ 24న 19 పేజీల లేఖను సోనియాగాంధీకి రాశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లుగా కేంద్రం ప్రకటనతో అప్పట్లో కొందరు ఉద్యమకారులు తిరిగి ఆమెను విధుల్లో చేరాలని ఒత్తిడి తేవడంతో రాజీనామా వెనక్కి తీసుకుంటూ లెటర్‌ ఇచ్చారు. ప్రభుత్వం కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంది.

రెండోసారి రాజీనామా.. ఎన్నికల్లో పోటీ
రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కావడంతో నళిని 2011 నవంబరు 1న మరోసారి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహించారు. ఢిల్లీలో దీక్ష చేస్తానని ప్రకటించడంతో ప్రభుత్వం నళిని రాజీనామా ఆమోదించకుండా, డిసెంబరు 4న విధులనుంచి తొలగించింది. 2011 డిసెంబరు 9న తెలంగాణ ఇవ్వాలని, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు దిగడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. తెలంగాణవాదుల వినతి మేరకు దీక్ష విరమించారు. ఆ తర్వాత తెలంగాణ నళిని క్రాంతిసేన ఏర్పాటు చేశారు. 2012లో పరకాల ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం అదే ఏడాది నవంబరు 1న బీజేపీలో చేరినప్పటికీ ఆమె రాజకీయాల్లో చురుకుగా లేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement