చికిత్స పొందుతున్న ఇద్దరు వలస కార్మికులు మృతి | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న ఇద్దరు వలస కార్మికులు మృతి

Published Mon, Dec 18 2023 1:32 AM

-

భూదాన్‌పోచంపల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్‌సిలిండర్‌ నుంచి మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడి ఆస్పపత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు సుజయ్‌ ధర్మాని(55), నాగేంద్రనాథ్‌ మండల్‌(50) ఆదివారం మృతిచెందారు. ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భూదాన్‌పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన శెట్టి సురేశ్‌ మూసీ పరీవాహక గ్రామాల్లో వరినాట్లు వేయించేందుకు ఈ నెల 13న ఉదయం పశ్చిమబెంగాల్‌కు చెందిన 10 మంది వలస కూలీలను రప్పించాడు.మున్సిపాలిటీ పరిధిలోని రేవనపల్లిలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలలో వారికి ఆశ్రయం కల్పించాడు. వారు మధ్యాహ్నం వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్‌పైప్‌కు మంటలు అంటుకొని పైప్‌ కాలిపోయింది. దాంతో చెలరేగిన మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా ఆరుగురు గాయపడ్డారు. వీరందరినీ చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా సుజయ్‌ ధర్మాని, నాగేంద్రనాథ్‌ మండల్‌ మృతిచెందారు. మిగతా నలుగురు చికిత్ప పొందుతున్నారని, వారికి ప్రాణాపాయం ఏమిలేదని ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement