విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి
నల్లగొండ: విద్యార్థులకు చదువుపై ఆత్మవిశ్వాసం పెంచేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గురుకుల విద్యాలయాల్లో కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు నిరంతరం మానసిక అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులపై విద్యాభారం, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ పరిస్థితుల ఒత్తిడిని అధిగమించే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. ప్రతి గురుకుల విద్యాలయంలో రెండు నెలలకు ఒకసారి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారని, అన్ని మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లతో చైల్డ్ వెల్ఫేర్ మీటింగ్ పెట్టి పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, నారాయణ అమిత్, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి పాల్గొన్నారు.
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ
త్వరగా పూర్తిచేయాలి
నల్లగొండ: జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఓటర్ల మ్యాపింగ్‌పై సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ రోజుకి 10 వేల చొప్పున చేస్తూ గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారం –8 ద్వారా ఫొటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని, ఈ ప్రక్రియ వచ్చేనెల 13 లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ అశోక్ రెడ్డి, స్పెషల్ ఈఆర్వో వెంకటేశ్వర్లు నల్లగొండ, కనగల్, తిప్పర్తి తహసీల్దార్లు పరుశురాం, పద్మ, రామకృష్ణ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


