నూతన పాలకవర్గానికి మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు
నల్లగొండ: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. నూతన స్ఫూర్తితో ముందుకు సాగుతూ ప్రజల విశ్వాసాన్ని నెరవేర్చే విధంగా గ్రామాభివృద్ధికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం నాయకత్వంలో గ్రామాలు ప్రగతి పథంలో నిలవాలని కోరారు.
పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా
నల్లగొండ: బాధిత పోలీసు కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉండి ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎస్పీ శరత్ చంద్రపవార్ అన్నారు. ఎస్‌ఐ సీత్యానాయక్ కొండమల్లేపల్లి పీఎస్‌లో పని చేస్తూ మృతి చెందగా.. బాధిత కుటుంబ సంక్షేమానికిగాను ఆయన భార్య దాస్లీబాయికి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ.2లక్షల చెక్కు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వినతుల స్వీకరణ
నల్లగొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ 37 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి, చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు.
నేడు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్
రిజిస్ట్రేషన్ మేళా
నల్లగొండ టూటౌన్: నల్లగొండలో మంగళవారం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాను అన్ని రకాల ఆహార వ్యాపార సంస్థలు, హోటళ్ల యాజమాన్యాలు వినియోగించుకోవాలని కోరారు.
నేడు రేణుకా ఎల్లమ్మ ఆలయ హుండీ లెక్కింపు
కనగల్: మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ హుండీ లెక్కింపును మంగళవారం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి అంబటి నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది విధిగా పాల్గొనాలని పేర్కొన్నారు.
నేడు, రేపు ఇంటర్
పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
రామగిరి(నల్లగొండ): జిల్లాలోని కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో మంగళవారం, బుధవారం జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఈ స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు.
బుద్ధవనాన్ని
సందర్శించిన జడ్జి
నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి మహ్మద్ ఇస్రత్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బుద్ధవనాన్ని సందర్శించారు. వీరికి బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర స్వాగతం పలికారు. అనంతరం జాతక వనం మహాస్థూపంపై చెక్కిన బుద్ధుడి చరిత్రను వివరించారు.
నూతన పాలకవర్గానికి మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు


