లెక్చరర్లకు రేషన్‌కార్డులా!
కొంత మంది అధ్యాపకులకు ఆహార భద్రత కార్డులు ఉన్నట్లు ఇటీవల ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించాం. నివేదిక రాగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై తదుపరి చర్యలు తీసుకుంటాం.
– దస్రునాయక్, డీఐఈఓ
నల్లగొండ టూటౌన్: దారిదర్య రేఖకు దిగువ ఉన్న వారికి ప్రభుత్వం అందించిన ఆహార భద్రతా కార్డులు ప్రభుత్వ అధ్యాపకుల చెంత కూడా ఉన్నాయి. రేషన్ దుకాణాల్లో నెల, నెలా సన్న బియ్యం సైతం తీసుకెళ్లడంతోపాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న 60 మందికి పైగా అధ్యాపకులు ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు వచ్చింది. ప్రభుత్వ అటెండర్ ఉద్యోగం చేసే వారు కూడా ఆహార భద్రత కార్డు తీసుకోవడానికి వీలు లేదు. కానీ గెజిట్ అధికారి హోదాలో ఉన్న జూనియర్ కాలేజీ అధ్యాపకులు ఆహార భద్రత కార్డులు తీసుకోవడంపై తీవ్ర దుమారం రేగుతోంది. మిగతా అధ్యాపకులే వారిని చూసి నివ్వెరపోతున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం..
జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కొంత మంది అధ్యాపకులు ఆహార భద్రత కార్డులు కలిగి ఉండి ప్రభుత్వ పథకాలను వినియోగించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కూడా వీటిని వినియోగించుకున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ కాలేజీలో చదివే తమ పిల్లల కోసం వారు తహసీల్దార్ కార్యాలయాల్లో తక్కువ ఆదాయం ఉన్నట్లు ధ్రువపత్రాలు పొందినట్లు తెలిసింది. ఇంకొందరు ఆరోగ్యశ్రీ ద్వారా తమ కుటుంబ సభ్యులకు వైద్య చికిత్స కూడా చేయించినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు వీరిని గుర్తించకపోవడం గమనార్హం. ఆహార భద్రత కార్డుల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే వందల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బయటపడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యేక విచారణ బృందాలు ఏర్పాటు చేయకుండా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారన్న దానిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నత స్థాయి విచారణ బృందం ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఫ ప్రభుత్వ పథకాలు పొందుతున్నట్లు ఇటీవల అధికారులకు ఫిర్యాదు
ఫ పిల్లల చదువుల కోసం తక్కువ ఆదాయం ఉన్నట్లు ధ్రువపత్రాలు
ఫ నెలనెలా రేషన్ బియ్యం
తీసుకెళ్తున్నా పట్టింపులేని వైనం
లెక్చరర్లకు రేషన్‌కార్డులా!


