నల్గొండలో ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు ఆత్మహత్య

- - Sakshi

నల్లగొండ క్రైం: డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలోని రాజీవ్‌ పార్కులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండలంలోని నక్కలపల్లికి చెందిన దొంతరబోయిన శివాని, అదే మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన అనుగూతల మనీష ఇంటర్మీడియట్‌ నుంచి స్నేహితులు.. వారు నల్లగొండ పట్టణంలోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో గల ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

గత 20 రోజులుగా ఇంటి వద్దనే ఉన్న వీరిద్దరు కళాశాలకు వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పి మంగళవారం ఉదయం బస్సులో నల్లగొండకు వచ్చారు. అనంతరం ఎన్జీ కళాశాల వెనుక ఉన్న రాజీవ్‌ పార్కులోకి ఇద్దరూ వెళ్లి గడ్డి మందు తాగి పార్కు గేట్‌ వద్దకు వచ్చి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. దీంతో చుట్టుపక్కల ఇళ్లలోని వారు వారి వద్దకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశారు. వెంటనే పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థినులను నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్ధినులు చికిత్స పొందుతూ మృతి చెందారు

ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరించారని
ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారని శివాని, మనీషను పోలీసులు ప్రశ్నించగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు తమను బెదిరించారని చెప్పారు. ఈ మేరకు వారిద్దరి ఫోన్లను పోలీసులు పరిశీలించగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరూ వారిని వేధించలేదని నిర్ధారించారు. వారి ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలించగా.. ఇద్దరు విద్యార్థినుల మధ్యే ఎక్కువగా ఫోన్‌ సంభాషణ ఉన్నట్లు తెలిసింది.

తమ పిల్లల ఆత్మహత్యకు గల కారణాలు తెలియదని.. పోలీసులే విచారించాలని శివాని తండ్రి సైదులు, మనీష తండ్రి మల్లయ్య నల్లగొండ టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడ్డి మందును నార్కట్‌పల్లిలో కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారి బ్యాగులో నిద్రమాత్రలు లభించాయి. విద్యార్థినులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top