విధి రాత.. కన్నోళ్లకు కడుపుకోత | Sakshi
Sakshi News home page

విధి రాత.. కన్నోళ్లకు కడుపుకోత

Published Sat, Jun 24 2023 7:22 AM

కుటుంబ సభ్యులతో గోపి (ఫైల్‌)  - Sakshi

మాడుగులపల్లి: పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా మనోధైర్యంతో కష్టాల కడలిని ఈదుతున్నారు ఆ దంపతులు. తమ ఇబ్బందులను చూసి అత్యుత్తమంగా చదువుతూ పనిలోనూ చేదోడు వాదోడుగా ఉంటున్న కుమారుడిని చూసి పొంగిపోయారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలువ లేదు. విధి వారికి కడుపుకోతను మిగిల్చింది. పిడుగు రూపంలో కుమారుడిని బలిగొనడంతో కన్నవారు తామెరికోసం బతకాలంటూ.. తమకిక దిక్కెవరంటూ రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టిస్తోంది. మాడుగుపల్లి మండలం పాములపహాడ్‌ గ్రామానికి చెందిన లింగయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం.

కుమారుడు గోపి(21) డిగ్రీ ఫైనలియర్‌, కుమార్తె ఇంటర్‌ చదువుతున్నారు. గోపి మొదటి నుంచి చదువుల్లో చురుకు. స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదివి 8.7 జీపీఏ సాధించాడు. ఇంటర్‌లోనూ 750 మార్కులు సాధించాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతూ సెలవు రోజుల్లో తండ్రికి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఏడాది క్రితం తండ్రి లింగయ్యకు రోడ్డు ప్రమాదంలో గాయపడగా, కాలుకు శస్త్ర చికిత్స జరిగడంతో మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం, జీవాల పెంపకం తదితర పనులన్నీ గోపినే చూసుకుంటున్నాడు.

ఈ నెల 20వ తేదీన పక్కింటి వ్యక్తితో కలిసి గోపి గొర్రెల మందను మేపేందుకు తోలుకెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభంకావడంతో ఇద్దరు సమీపంలోని చెట్టు కిందకు వెళ్లగా పక్కనే పిడుగుపడి గోపి మృతిచెందాడు. ఊహించని ఈ ఘటన నుంచి ఆ తల్లిదండ్రులు తేరుకోలేకపోతున్నారు.

ఓ వైపు భర్త మంచాన పడడం.. చేతికొచ్చిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కన్నతల్లి వేదన వర్ణనాతీతంగా మారింది. వృద్ధాప్యంలో తమకెవరు దిక్కంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టిస్తోంది. పుట్టెడు కష్టంలో ఉన్న నిరు పేద కుటుంబానికి ప్రభుత్వం, దాతలు బాసటగా నిలువాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement