బుద్ధవనానికి దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : గౌతమ బుద్ధుడి శాంతి సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తిచేస్తూ సాగిన మూడవ దమ్మ పాదయాత్ర ఆదివారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనానికి చేరుకుంది. 29 రోజుల పాటు సుమారు 403 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రకు బుద్ధవనం వద్ద ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య.. స్థానిక నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. బంజారా నృత్యాలు, కోలాటాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానికులు బౌద్ధాభిమానులు అడుగడునా పూలు చల్లుతూ యాత్రికులను ఆహ్వానించారు. ధర్మచక్రం వద్ద వారి పాదాలను కడిగి గౌరవించారు. థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన బుద్ధధాతువులను మహాస్థూపంలోని ధ్యానమందిరంలో ఉంచారు. బౌద్ధ భిక్షువులంతా జ్యోతులను వెలిగించి ధ్యానం చేశారు. ఈ సందర్భంగా మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ థాయిలాండ్, భారతదేశంలోని భిక్షువులతో కలిసి 403 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి బుద్ధవనం చేరుకున్నారని తెలిపారు. థాయిలాండ్ రాజ కుటుంబం ఈ దమ్మయాత్రకు సహకరించిందన్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి గగన్‌మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్‌మాలిక్ ముందుండి నడిపించారని తెలిపారు. అక్షయ ఫౌండేషన్ అధ్యక్షుడు కేకే రాజా దమ్మయాత్ర విజయవంత కావడంలో భాగస్వాములయ్యారని చెప్పారు. బీఎస్‌ఐ తెలంగాణ అధ్యక్షుడు పరంధాములు ఆధ్వర్యంలో యాత్రకు సేవలుందించారని తెలిపారు. 29 రోజుల పాటు సాగిన ఈ దమ్మ యాత్రలో ‘సాతి’ అనే శునకం భిక్షువులతో పాటు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మనస స్వర్ణ, బుద్ధవనం మేనేజర్ శ్యాంసుందర్‌రావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజాప్రసాద్, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మర్ల చంద్రారెడ్డి, సీఐ శ్రీనునాయక్, ఎస్‌ఐ మత్తుయ్య పాల్గొన్నారు.
ఫ ఘన స్వాగతం పలికిన సాగర్‌వాసులు
బుద్ధవనానికి దమ్మ పాదయాత్ర


