పల్లెలకు రూ.17.11 కోట్లు
సీరియల్‌గా బిల్లుల చెల్లింపు
నల్లగొండ : గ్రామ పంచాయతీకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. కేంద్రం నుంచి రెండు విడతల్లో ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. మొత్తం 32 మండలాలకు మొదటి విడతలో రూ.16.14 కోట్లు విడుదల కాగా.. ఇటీవల రెండో విడతలో రూ.17.11 కోట్లు వచ్చాయి. ఇందులో టైడ్ నిధుల నుంచి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిపాటు ‘ప్రత్యేక’ పాలన
గ్రామ పంచాయతీ పాలక వర్గాల కాల పరిమితి పూర్తయిన తర్వాత సంవత్సరం పాటు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఆ సందర్భంలో అత్యవసర పనుల కోసం కార్యదర్శులు సొంతంగా ఖర్చులు పెట్టారు. ఆ బిల్లుల చెల్లింపు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతకు ముందు కూడా పాత సర్పంచ్‌ల కాలం నుంచే చాలా వరకు బిల్లులు రాలేదు. అప్పట్లో వచ్చిన ఆర్థిక సంఘం నిధులు వారికి సరిపోలేదు. ప్రస్తుతం కొత్త పాలకవర్గాలు రావడంతో కేంద్రం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. అయితే తమ బకాయిలు చెల్లించాలని ఇటీవల కార్యదర్శులంతా ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసిందే.
చెల్లింపునకు సర్క్యులర్ జారీ..
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గతంలో ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి సర్క్యులర్ జారీ చేశారు. ఆర్థిక సంఘం నిధుల్లో టైడ్, అన్‌టైడ్ నిధులు వస్తాయి. వాటిల్లో టైడ్ నిధులను పాత బిల్లుల చెల్లింపునకు వాడాలని సర్క్యులర్ జారీ చేశారు. నిబంధనల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు చేయాలని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం పాత బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కార్యదర్శులకు ఊరట లభించింది. ఇప్పటికే కొందరు కార్యదర్శులకు పాత బిల్లులు చెల్లించారు.
కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధుల్లో టైడ్ నిధుల నుంచి గతంలో చేపట్టిన పనులకు పంచాయతీలు బిల్లులు చెల్లించుకోవచ్చు. ఆ బిల్లుల్లో కూడా సీరియల్ ప్రకారం చెల్లించాలని ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసి పంచాయతీలకు పంపాం.
– శంకర్‌నాయక్, డీపీఓ
ఫ 15వ ఆర్థిక సంఘం నుంచి
రెండవ విడత నిధులు విడుదల
ఫ పాత బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యం
ఫ హర్షం వ్యక్తం చేస్తున్న కార్యదర్శులు


