ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు
మెరుగైన వైద్యం అందుతోంది
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. గతంలో ప్రభుత్వ ఆసుపత్రి వైపు వచ్చేందుకు మహిళలు జంకేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడంతో ప్రసవాల కోసం గర్భిణులు క్యూ కడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో ఆయిదారేళ్లుగా రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయి. ఏడేళ్లుగా జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో 71,737 ప్రసవాలు జరగ్గా కేవలం.. ఒక్క ఎంసీహెచ్‌లోనే 49,842 ప్రసవాలు జరిగాయి.
జీజీహెచ్‌లో మెరుగైన వసతులు
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పించడంతో పాటుగా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండడంతో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. దాంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్, బ్లడ్ బ్యాంకు ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను అందించి ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ప్రసవాలకు ఆసుపత్రికి వచ్చే సమయంలో, ప్రసవం తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి ప్రభుత్వ వాహనంలో తీసుకొళ్లి తీసుకొచ్చేవారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది.
గర్భిణి నమోదు నుంచి పర్యవేక్షణ..
గర్భం దాల్చిన మూడో నెలలోనే ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వారి ఇంటి వద్దే గర్భిణుల పేర్లను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి చెకప్ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వారిని తీసుకెళ్లడంతో పాటు టీకాలు కూడా సరైన సమయంలో వేయిస్తున్నారు. ప్రసవాల కోసం పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులకు తీసుకెళుతున్నారు. అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడి వైద్యుల సూచనల మేరకు జీజీహెచ్‌కు రెఫర్ చేస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి పరిస్థితి ఆమెకు అందించాల్సిన వైద్యం వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎంసీహెచ్ యాప్‌లో డాక్టర్లు అప్‌లోడ్ చేస్తున్నారు. జీజీహెచ్‌లో ఉండే వైద్యులు గర్భిణులు ఆసుపత్రిలో చేరేలోపు అప్రమత్తమై ఆమెకు అందించాల్సిన చికిత్స కోసం సిద్ధంగా ఉండి ప్రసవాలు చేస్తున్నారు. జీజీహెచ్‌లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితె వెంటనే వారిని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రిఫర్ చేయడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిని రాష్ట్రస్థాయి ఎంసీహెచ్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో అక్కడ వారికి సరైన వైద్యం అంది సుఖ ప్రసవాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్‌సీ స్థాయిలోనే గర్భిణులను నమోదు చేసి వారిని రెగ్యులర్‌గా చెకప్‌కు తీసుకుపోతున్నారు. డెలివరీ అయ్యేంత వరకు ఆశ వర్కర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
– డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత,
జీజీహెచ్ సూపరింటెండెంట్
ఫ మౌలిక సదుపాయాలు
పెరగడంతో సర్కార్ దవాఖానాకు వస్తున్న గర్భిణులు
ఫ ఎంసీహెచ్‌లో రికార్డు స్థాయిలో డెలీవరీలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు


