అక్టోబర్‌లో ఒక్క రోజే వర్షం..
వరి కొంత మెరుగు..
జిల్లావ్యాప్తంగా 1.58లక్షల ఎకరాల్లో పంటలపై ప్రతికూల పరిస్థితులు
● వర్షాభావంతో 1.16లక్షల ఎకరాల్లో పంటలపై ఒత్తిడి
● 42వేల ఎకరాల్లో ఎండుముఖం
● పత్తి, మొక్కజొన్నపై తీవ్ర ప్రభావం
నాగర్‌కర్నూల్: ఈసారి వానాకాలం పంటలకు తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఎల్‌నినో కారణంగా నెలకొన్న వర్షాభావంతో నానాటికీ పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా నేలలో తేమ తగ్గిపోవడం పంటల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న సాగుచేసిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 5,14,146 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా.. వీటిలో వ్యవసాయశాఖ అంచనా ప్రకారం 3,55,871 ఎకరాల్లో మాత్రమే పంటలు సాధారణ స్థితిలో ఉన్నా యి. మొత్తంగా 1,58,275 ఎకరాల్లో పంటలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు గణాంకా లు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని వ్యవసాయశాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది.
పత్తిపైనే అధిక ప్రభావం..
జిల్లాలో అత్యధికంగా 2,69,206 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. ఇందులో 96,031 ఎకరాల్లో పంట ఒత్తిడిలో ఉండగా.. 28,661 ఎకరాల్లో వాడుదల, 4,272 ఎకరాల్లో ఎండుదల నమోదైంది. అంటే మొత్తం పత్తి విస్తీర్ణంలో సుమారు 48 శాతం మేర పంటలు సాధారణ పరిస్థితుల్లో లేవు. వర్షాధారంగా సాగుచేసిన పొలాల్లో నేల తేమ తగ్గడంతో పంట ఎదుగుదల, కాయల అభివృద్ధిపై ప్రభావం పడింది.
మొక్కజొన్నకూ తప్పని కష్టాలు..
జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న 20,166 ఎకరాల్లో సాగు కాగా.. 4,493 ఎకరాల్లో పంట ఒత్తిడిలో ఉంది. మరో 3,224 ఎకరాల్లో వాడుదల, 3,852 ఎకరాల్లో ఎండుదల నమోదైంది. మొత్తంగా 11,569 ఎకరాల్లో పంట సాధారణ స్థితిలో లేదు. అంటే మొక్కజొన్న విస్తీర్ణంలో సుమారు 57 శాతం మేర ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. పంట కీలక ఎదుగుదల దశలో తగినంత తేమ అందకపోవడంతో దిగుబడులపై ప్రభావం పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో జూన్ నుంచి అక్టోబర్ వరకు సాధారణ వర్షపాతం 583.2 మి.మీ. కురువాల్సి ఉండగా.. 339.4 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో 120 శాతం లోటు ఏర్పడింది. అక్టోబర్‌లో జిల్లా అంతట కేవలం ఒక రోజు మాత్రమే వర్షం కురిసింది. 106.1 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 11.3 మి.మీ. వర్షపాతమే కురిసింది. ఈ ఒక్క నెలలో 89శాతం లోటు ఉంది. వర్షాలు సకాలంలో కురవకపోవడం, ఆ తర్వాత విరామాలు రావడంతో పంటలకు అవసరమైన తేమ అందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తద్వారా పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలకు ప్రతికూల పరిస్థితులు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పంటల దిగుబడులు వస్తాయా.. లేదా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం పరిస్థితిని గమనించి.. జిల్లాలో 13 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. యాసంగి సీజన్‌లో క్రాప్ హాలీడే ప్రకటించాలని ప్రభుత్వం చెబుతోంది. వానాకాలం పంటలతో రైతులకు లాభాలు లేకపోగా.. నష్టమే కలగనుంది. ఇక యాసంగిలో పంటలు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 1,26,858 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఇందులో 1,11,101 ఎకరాల్లో పంట సాధారణ స్థితిలో ఉంది. 14,042 ఎకరాల్లో ఒత్తిడి, 1,715 ఎకరాల్లో వాడుదల నమోదైంది. వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం వరి పంటలో ఎండుదల నమోదు కాలేదు. ఇతర పంటలతో పోలిస్తే వరిపంట పరిస్థితి కొంత మెరుగ్గా కనిపిస్తుంది. అయితే వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవడంతో నీటి లభ్యత ఇబ్బందిగా మారడం.. కేఎల్‌ఐ నుంచి సాగునీరు సక్రమంగా రాకపోవడంతో సమస్యగా మారింది. దీంతోపాటు కరెంటు సమస్య రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.


