దీపోత్సవాలకు ఆలయాలు సిద్ధం
● ఈ నెల 24న కార్తీక పౌర్ణమి
● స్నాన, జప, ఉపవాసాలతో
జీవనశైలి మెరుగు
● నేటినుంచి ఆలయాల్లో
మొదలుకానున్న సందడి
అచ్చంపేట: కార్తీక మాసం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసం హరిహరులకు ప్రీతిపాత్రమైన నెలగా భక్తులు విశ్వసిస్తారు. వేకువజామున స్నానాలు ఆచరించి.. దీపాలు వెలిగించడం వెనక గొప్ప ఆరోగ్య సూత్రం ఉందని భావిస్తుంటారు. స్నాన, దాన, జప, పూజ, ఉపవాస, దీపారాధన, వన భోజనాలు వంటివి చేయడం ద్వారా జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి.. అనంతమైన పుణ్యాలను పొందవచ్చని భక్తుల నమ్మకం. ప్రత్యేక అభిషేకాలు, పూజలు కనుల పండువగా నిర్వహిస్తారు. కార్తీకమాసంలో దీపదానం చేయాలన్నది శాస్త్రవచనం. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు చన్నీటితో స్నానం ఎంతో ఆరోగ్యదాయకం. ఉసిరి చెట్టును శ్రీమహావిష్ణువుగా, లక్ష్మీప్రదంగా భావించాలని ఉంది. అత్యంత ప్రీతిపాత్రమైన ఉసిరి చెట్టు కింద వనభోజనాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మాసంలో ఉమ్మడి పాలమూరు జిల్లావాసులు కృష్ణానదిలో కార్తీక స్నానాలు ఆచరించి.. వైష్ణవ, శివాలయాల వద్ద ఆకాశ దీపాలు ఏర్పాటు చేస్తారు. కాగా జిల్లాలోని సోమశిల సోమేశ్వరాలయం, అచ్చంపేట సమీపంలోని ఉమామహేశ్వర క్షేత్రం, పాతాళగంగ వద్ద భక్తుల సందడి నెలకొంటుంది.


