చారకొండ: నిత్యం సినిమా షుటింగ్‌లతో బిజీగా ఉండే సినీ హీరో శర్వానంద్ చారకొండ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రత్యక్షమయ్యారు. మండలంలోని జూపల్లి శివారులోని జేపల్లి గ్రామం సమీపంలో మూడు నెలల క్రితం సర్వే నం.148లో దాదాపు 25 ఎకరాలు కొనుగోలు చేశారు. గత ఆగస్టులో 17 ఎకరాలు రిజిస్ట్రేషన్ పూర్తి కాగా.. తాజాగా మరో 4.10 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ఉన్నందున చారకొండ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. భూమికి సంబంధించిన పత్రాలతో నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం తహసీల్దార్ ఉమ సంబంధిత పత్రాలు అందజేశారు. చారకొండకు హీరో శర్వానంద్ రాకతో సందడి నెలకొంది. అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు.
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
నాగర్‌కర్నూల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయంతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి 23 ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పాండునాయక్, ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 4..
కందనూలు: ప్రజలు నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో బాధితుల నుంచి ఎస్పీ 4 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 1 భూమికి సంబంధించినవి, 2 కుటుంబ పంచాయితీ, 1 తగు న్యాయం చేయాలని ఫిర్యాదు వచ్చాయి. ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు.
వైద్యాధికారులు
అందుబాటులో ఉండాలి
తిమ్మాజిపేట: ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. సోమవారం ఆయన స్థానిక పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి.. వైద్య సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతిఒక్కరు విధులకు సకాలంలో హాజరుకావాలని, రోగులకు వైద్య సేవలు అందించడంతో పాటు వైద్య సలహాలు ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో కొంత సమయం రోగులకు వైద్య సేవలు అందించారు. ఓపీ రిజిష్టర్, వైద్య సిబ్బంది హాజరు, పలు రికార్డులను పరిశీలించారు. అంతకు ముందు మరికల్‌లోని ఉపవైద్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట డాక్టర్ సుష్మ తదితరులున్నారు.
ఎన్‌హెచ్‌ఎంల డిమాండ్లపై సానుకూల స్పందన
కందనూలు: జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని డీఎంహెచ్‌ఓ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఎం నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ముషారఫ్ అలీ ఫారూఖీ టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నందున వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఉద్యోగులు సమ్మె విరమించి వెంటనే విధులకు హాజరుకావాలని సూచించినట్లు చెప్పారు. విధులకు హాజరుకాని ఉద్యోగుల విషయంలో నిబంధనల ప్రకారం ‘నో వర్క్– నో పే’ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.


