కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని.. తద్వారా పేదల సొంతింటి కల సాకారం చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న ప్రజా పాలనకు ప్రజలు అండగా నిలబడాలని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు ఆదివారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌తో కలిసి ఇందిరమ్మ లబ్ధిదారులు వెంకటమ్మ ఇంటికి వెళ్లి దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి దీపావళి తొలి పండుగను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో 2802 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి.. ప్రతి ఇంటికి నాలుగు దశల్లో రూ.5 లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశామన్నారు. సొంత ఇంటిని నిర్మించుకున్న కుటుంబాలు కొత్త ఆశలతో ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించడంతోపాటు వారి జీవన ప్రమా ణాలను మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుందన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించడంతోపాటు లబ్ధిదారులకు అవసరమైన మార్గదర్శకాలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రత్నమాల, గృహ నిర్మాణ శాఖ ఇన్‌చార్జి పీడీ గోపాల్‌నాయక్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఎంపీడీఓ యాదయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ షానవాజ్‌ఖాన్, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


