నాగర్‌కర్నూల్/కందనూలు: జిల్లాలో బియ్యం ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, మార్కెట్‌లో వాటి లభ్యత, బియ్యం ధరల నియంత్రణ, నిల్వల పరిస్థితి, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో బియ్యం ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా వివిధ రకాల బియ్యం 26 కిలోల బస్తాల విక్రయాల ప్రాతిపదికన కిలోకు గరిష్ట చిల్లర ధరలను కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు. బీపీటీ, కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రూ.79 చొప్పున గరిష్ట వినియోగదారు ధరలకు విక్రయించేందుకు రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులు అంగీకరించారని కలెక్టర్ తెలిపారు. బియ్యం బస్తాపై నిర్దేశించిన ధరలను తప్పనిసరిగా ముద్రించాలని సూచించారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, సూపర్ మార్కెట్ల నిర్వాహకులు నిర్ణయించిన గరిష్ట ధరల కంటే అధికంగా వసూలు చేయరాదని స్పష్టం చేశారు. కేవలం బ్రాండ్ పేరు లేదా బ్రాండ్ విలువ ఆధారంగా ఒకే రకం బియ్యాన్ని అధిక ధరకు విక్రయించడానికి అనుమతి లేదన్నారు. రైస్ మిల్లర్లు ప్రతి నెలా కొనుగోలు రిటర్న్‌లను సంబంధిత శాఖలకు సమర్పించాలని సూచించారు. బియ్యం ధరల నియంత్రణ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ శాఖల అధికారులతో సంయుక్త బృందాలను ఏర్పాటుచేసి, నిరంతర తనిఖీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ధరల లేబుళ్లలో అక్రమంగా మార్పులు చేయడం, తప్పనిసరిగా ముద్రించాల్సిన వివరాలను ముద్రించకపోవడం, నిర్ణీత గరిష్ట చిల్లర ధర కంటే అధిక ధరలను ముద్రించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే సంబంధిత ప్యాకింగ్ యూనిట్లపై లీగల్ మెట్రాలజీ చట్టం–2009, ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలు–2011 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు సరఫరాచేసే బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసుశాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో స్థానిక వినియోగ అవసరాలకు సరిపడా బియ్యం, ధాన్యం నిల్వలు అందుబాటులో ఉండేలా కొనుగోళ్లు, నిల్వల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ధాన్యం ఇతర జిల్లాలకు లేదా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక మార్కెట్లలో బియ్యం కొరత ఏర్పడినా, ధరలు అసాధారణంగా పెరిగినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు, జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం ప్రతినిధులు, వ్యాపారులు ఉన్నారు.


