డిండి ప్రాజెక్టు రద్దుచేసే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

డిండి ప్రాజెక్టు రద్దుచేసే వరకు పోరాటం

Sep 28 2026 12:41 AM | Updated on Sep 28 2026 12:41 AM

నాగర్‌కర్నూల్‌/కల్వకుర్తి రూరల్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రైతుల పాలిట శాపంగా మారిన డిండి ప్రాజెక్టును రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ నేతలు పునరుద్ఘాటించారు. వంగూరు మండలం ఉల్పర నుంచి ఆదివారం ఉమ్మడి పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను ప్రొ.హరగోపాల్‌ జెండా ఊపి ప్రారంభించారు. రైతులు ఫ్లకార్డులను చేతబూని పాలమూరు నీరు ఇక్కడి రైతులకే దక్కాలని.. నల్లగొండ జిల్లాకు తరలించొద్దని నినదించారు. అక్కడి నుంచి పాదయాత్ర కోనాపూర్‌కు చేరుకోగా.. ఎమ్మెల్సీ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఈ ప్రాంత రైతాంగం చేస్తున్న సాగునీటి సాధన ఉద్యమానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రకటించారు. ఈ ప్రాంతానికి అన్యాయంచేసి, నల్లగొండ జిల్లాకు నీటిని తీసుకుపోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతానికి మరో మార్గం ద్వారా నీరందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కోనాపూర్‌ నుంచి రంగాపూర్‌ మీదుగా ఎల్లికల్‌ వరకు పాదయాత్ర సాగింది. అక్కడ ప్రజలకు పాదయాత్ర ప్రాధాన్యత, డిండి ప్రాజెక్టుతో జరిగే నష్టాన్ని జేఏసీ నాయకులు వివరించారు. ప్రజలు చైతన్యవంతులై ఉద్యమంలో కదం తొక్కాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి కల్వకుర్తి సమీపానికి చేరుకున్న పాదయాత్రలో మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ పాల్గొని సంఘీబావం ప్రకటించారు. అక్కడి నుంచి కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయానికి జేఏసీ నాయకులు చేరుకొని డీఏఓకు వినతిపత్రం అందజేశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి స్వంత మండలం నుంచే రైతన్నలు సాగునీటి కోసం పోరుబాట పట్టడం చర్చనీయాంశంగా మారింది.

డిండి ప్రాజెక్టు ఆపే బాధ్యత సీఎందే..

పాలమూరుకు అన్యాయం చేసే డిండి ప్రాజెక్టు ఆపే బాధ్యత ఈ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదే అని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన డిండి ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టడం అంటే, ఈ ప్రాంతానికి అన్యాయం చేయడమేనని అన్నారు. ఉమ్మడి పాలమూరు రైతాంగానికి పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వాల్సింది పోయి నల్లగొండకు తరలించాలని చూడటం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పాలమూరుకు నష్టం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని.. ప్రజల తరఫున ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు.

కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో జేఏసీ నాయకులు ప్రొ.హరగోపాల్‌, రాఘవాచారి, రాజేందర్‌రెడ్డి, బెక్కెం జనార్దన్‌ మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి డిండి ఎత్తిపోతల ద్వారా నల్లగొండ ప్రాంతానికి సాగునీరు తీసుకుపోతే ఉమ్మడి పాలమూరుకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. నల్లగొండకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ డిండి ప్రాజెక్టు పేరుతో జలదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంతో నష్టపోయిందని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి రావడం దారుణమన్నారు. ప్రభుత్వం డిండి ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, గువ్వల బాలరాజు, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, జేఏసి నాయకులు వెంకట్‌గౌడ్‌, సదానందంగౌడ్‌, వీరబ్రహ్మాచారి, బీజేపీ నాయకులు నరేందర్‌రావు, వెల్దండ శ్రీనివాస్‌, బండె ల రామచంద్రారెడ్డి, దుర్గాప్రసాద్‌, జంగయ్య, దేవీలాల్‌ చౌహాన్‌, నాగేష్‌ గౌడ్‌, బ్రహ్మం, పులిజాల పరుశరాములు పాల్గొన్నారు.

సీఎం స్వంత మండలం నుంచే మొదలైన పోరు

పాలమూరును ఆగం చేయొద్దని జేఏసీ ఆధ్వర్యంలో కదిలిన రైతాంగం

సంఘీభావం తెలిపిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొ.హరగోపాల్‌

తరలివచ్చిన రైతులు..

పాదయాత్రకు వివిధ గ్రామాల నుంచి రైతులు తరలివచ్చారు. కార్వంగ, ఉల్పర, కోనాపూర్‌, ఎల్లికల్‌, రంగాపూర్‌, కల్వకుర్తి తదితర గ్రామాల రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. చారకొండ మండలం ఎర్రవల్లి నుంచి అధికంగా వచ్చారు. డిండి ఎత్తిపోతల పథకంతో తమ గ్రామం ముంపునకు గురవుతుందని.. ఆ ప్రాజెక్టు వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement