కొల్లాపూర్: జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన సింగోటం–గోపల్‌దిన్నె లింక్ కెనాల్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. భూసేకరణ పేరుతో పనుల్లో కాలయాపన జరుగుతోంది. ఫలితంగా కెనాల్‌పై ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పాలక ప్రభుత్వాలు మారినా పనుల్లో పురోగతి కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు.
పెండింగ్‌లో పనులు..
కొల్లాపూర్ నియోజకవర్గంలో జూరాల ఎడమ కాల్వ కింద చివరి ఆయకట్టు వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. ఈ ప్రాంత రైతులకు తరచుగా సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సింగోటం–గోపల్‌దిన్నె లింకు కెనాల్‌కు శ్రీకారం చుట్టారు. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని మళ్లించే విధంగా డిజైన్ చేశారు. ఇందుకోసం గత ప్రభుత్వం రూ. 147.7 కోట్లు మంజూరుచేసింది. ఐదేళ్ల క్రితం టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, పనులు ప్రారంభించింది. మొదట్లో గోపల్‌దిన్నె రిజార్వాయర్‌కు అనుసంధానంగా 5 కి.మీ. మేరకు కాల్వలను తవ్వారు. ఆ తర్వాత భూసేకరణ సమస్య పేరుతో పనులు నిలిచిపోయాయి.
భూసేకరణ ప్రక్రియలో జాప్యం..
వనపర్తి జిల్లా పరిధిలో 200 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 100 ఎకరాలు భూసేకరణ చేపట్టాల్సి ఉంది. అయితే భూసేకరణ ప్రక్రియ అసంపూర్తిగానే ఉంది. గత ప్రభుత్వం ఈ పనుల పూర్తికి ప్రయత్నించినప్పటికీ వేర్వేరు కారణాల వల్ల ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు కెనాల్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. కెనాల్ తవ్వకాలకు అవసరమైన భూసేకరణ అంశాలపై చర్చించారు. నిర్వాసిత రైతులతోనూ మాట్లాడారు. పరిహారం చెల్లింపు అంశాలపై కూడా స్పష్టత ఇచ్చారు. కానీ అధికారులు మాత్రం పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం కనబరుస్తూ కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కెనాల్ పూర్తయితే..
సింగోటం–గోపల్‌దిన్నె లింకు కెనాల్‌తో కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపనగండ్ల, చిన్నంబావి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. పాన్‌గల్ మండలంలో కొంత మేరకు సాగునీరు అందనుంది. లింకు కెనాల్‌కు తూములు ఏర్పాటుచేసి, సమీపంలోని చెరువులు, కుంటలకు నీరు మళ్లించేలా డిజైన్లు రూపొందించారు. తద్వారా జూరాల ఎడమ కాల్వ కింద 24,500 ఎకరాలు, రాజీవ్ భీమా కాల్వల కింద 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుంది. అదే విధంగా వేసవిలో గోపల్‌దిన్నె రిజర్వాయర్ కింద ఉండే పలు గ్రామాలకు తాగునీటి సమస్య కూడా తీరుతుంది.
అసంపూర్తిగా సింగోటం – గోపల్‌దిన్నె లింక్ కెనాల్
దీర్ఘకాలంగా పెండింగ్‌లోనే పనులు
చివరి ఆయకట్టుకు తప్పని సాగునీటి సమస్య
ఉన్నతాధికారులకు నివేదించాం..
లింక్ కెనాల్ తవ్వకాల కోసం అవసరమైన భూసేకరణకు చర్యలు చేపట్టాం. గ్రామాల వారీగా రైతులతో గతంలో మాట్లాడాం. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పనుల పురోగతిపై చర్చించారు. కెనాల్ పనులకు సంబంధించిన అంశాలు ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నాయి.
– లోకిలాల్ నాయక్, ఈఈ, నీటిపారుదలశాఖ


