తిమ్మాజిపేట: స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని ఉల్లాస్ పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు భాస్కర్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం తిమ్మాజిపేట మండలంలోని మరికల్, గొరిట గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఉల్లాస్ పరీక్ష కేంద్రాలను వారు పరిశీలించి.. స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఉల్లాస్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదే విధంగా గుర్తించబడిన ప్రతి అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వచ్చి, పరీక్ష రాసేలా సంబంధిత అధికారులు, వలంటీర్లు, సమన్వయంతో కృషి చేయాలన్నారు. తిమ్మాజిపేట మండలంలో 1,045 మందికి గాను అమ్మకు అక్షరమాల పరీక్ష రాసిన వారు 875 మంది ఉన్నారని ఏపీఎం నిరంజన్ తెలిపారు. వారి వెంట సీ్త్రనిధి డైరెక్టర్ అమృత, సీసీలు యాదమ్మ, వెంకటేశ్వరమ్మ, తిరుపతమ్మ, నాగరాజు ఉన్నారు.
పోడు భూములకు
పట్టాలివ్వాలి
కొల్లాపూర్ రూరల్: గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని అమరగిరిలో ఆదివాసి గిరిజనులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అశోక్‌నాయక్ మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజనులు, తదితరులు ఉన్నారు.
సాగునీటి వృథా..
తప్పని వ్యధ
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద వరద నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన సమాంతర కాల్వ షట్టర్ల మరమ్మతు పూర్తిగాకపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నిల్వనీరు వృథాగా పారుతోంది. ప్రభుత్వం మూడేళ్ల కిందట షట్టర్ల మరమ్మతుకు రూ.20 లక్షలు మంజూరు చేసింది. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్న సమయంలో కాల్వ ప్రధాన హెడ్ రెగ్యులేటరీ వద్ద షట్టర్లకు నీటి సరఫరా నిలిపివేసేందుకు రింగ్‌బండ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతిసారి రింగ్‌బండ్ ఏర్పాటు చేయడం.. వచ్చిన వరద ప్రవాహంతో మొర్రం కొట్టుకుపోవడంతో మరమ్మతు పూర్తి కావడం లేదు. ప్రస్తుత సమయంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేయక చేతులెత్తేస్తున్న అధికారులు.. సమాంతర కాల్వ నుంచి రోజు 60 నుంచి 100 క్యూసెక్కుల నీరు లీకేజీ రూపంలో వృథాగా పారుతున్నా అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికై నా స్పందించి సమాంతర కాల్వ షట్టర్ల మరమ్మతు పూర్తిచేసి నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


