అచ్చంపేట మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కరికే రెండేసి దుకాణాలు కేటాయించడం.. ఏళ్ల తరబడి రీ టెండర్లు నిర్వహించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుకాణదారులు రూ.లక్షల్లో బకాయిలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు లేకపోలేదు. అచ్చంపేటలో సామాన్య వ్యాపారులకు దుకాణాలు దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో అతి తక్కువ అద్దెతో బడా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కాగా, బినామీల నుంచి అధికంగా అద్దె వసూలు చేస్తున్న సదరు దుకాణదారులు.. ప్రభుత్వానికి మాత్రం రూ.లక్షల్లో బకాయిపడ్డారు. మండల పరిషత్ కార్యాలయ వివరాల ప్రకారం ఒక్కో దుకాణానికి రూ. 40వేల నుంచి రూ. 1.52లక్షల వరకు బకాయి ఉన్నారు.
అచ్చంపేట: నిరుద్యోగ యువతకు ఉపాధి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మండల పరిషత్, మున్సిపల్, గ్రామ పంచాయతీలు, ఎస్పీ కార్పొరేషన్ ద్వారా దుకాణ సముదాయాలు నిర్మించింది. ఈ సంకల్పం మంచిదైనా ఏళ్ల తరబడి దుకాణాలకు టెండర్లు నిర్వహించకపోవడంతో వ్యాపారులు తిష్టవేసి.. బినామీలకు అద్దెకు ఇస్తున్నారు. అలాంటి వారిని ఖాళీ చేయించకుండా అధికారులు చోద్యం చూస్తుండటంతో చాలా మంది అడ్డా వ్యాపారాలు సాగిస్తున్నారు.
ఏళ్ల తరబడి పట్టని అధికారులు..
అచ్చంపేట మండల పరిషత్ కార్యాలయం, ఏయూపీఎస్ పాఠశాల వద్ద ప్రధాన రహదారి పక్కన 2002లో 37 వ్యాపార దుకాణాలు నిర్మించి వివిధ వర్గాలకు కేటాయించారు. వాటి అగ్రిమెంట్ గడువు 2007, 2009తో ముగిసింది. అయితే ఏళ్లు గడుస్తున్నా తిరిగి వేలం నిర్వహించకపోవడంతో బినామీలు ఎక్కువయ్యారు. టెండర్‌దారులు అతితక్కువ అద్దెను ప్రభుత్వానికి చెల్లిస్తూ రెట్టింపు స్థాయిలో బినామీలకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. మండల పరిషత్ దుకాణ సముదాయంలోని 1, 5, 7, 8 దుకాణాలకు రూ. 5వేలు, 9 నుంచి 15 వరకు, 17 నుంచి 21 వరకు దుకాణాలకు రూ. 8వేలు, 6, 16, 22 నుంచి 37 వరకు రూ. 3వేలు మాత్రమే ప్రభుత్వానికి అద్దె చెల్లిస్తూ.. బినామీల నుంచి రూ. 10నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. కాగా, షాపింగ్ కాంప్లెక్స్‌లో డిపాజిట్లు, అద్దెలు సక్రమంగా చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇప్పటి వరకు రూ. 26.35లక్షల వరకు అద్దె బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. ప్రతి ఏటా 5 నుంచి 10శాతం అద్దె పెంచాల్సి ఉన్నా.. ఏళ్ల తరబడి అదే అద్దె కొనసాగుతోంది. స్థానిక అధికారులు దుకాణదారులతో కుమ్ముకై పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బకాయిలను వసూలు చేస్తాం..
అచ్చంపేట మండల పరిషత్ దుకాణ సముదాయంలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వ్యాపారులకు నోటీసులు జారీచేసే ప్రక్రియ చేపడుతాం. దుకాణాల్లో బినామీల లెక్కలు తేల్చుతాం. దుకాణాలు దక్కించుకున్న వారికి ఇచ్చిన అగ్రిమెంట్ పూర్తయి ఏళ్లు గడుస్తోంది. ఈ విషయంపై కలెక్టర్‌కు పూర్తి నివేదిక అందజేసి, తదుపరి ఆదేశాల మేరకు టెండర్ల నిర్వహణ చేపడుతాం. – వెంకటప్రసాద్, డీఎల్‌పీఓ
దుకాణ సముదాయాలకు ఏళ్లుగా జరగని టెండర్లు
అగ్రిమెంట్ గడువు తీరినా ఖాళీ చేయని వ్యాపారులు
ఇతరులకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్న వైనం
అచ్చంపేట మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్‌లో పేరుకుపోయిన బకాయిలు
ప్రభుత్వ ఆదాయానికి గండి


