కందనూలు: జిల్లాలో సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా భూతగాదా కేసులు, రాజీ చేసుకోదగిన క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబం, మోటారు వాహనాల ప్రమాదాలు, బ్యాంకు తదితర పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్ లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు. అనంతరం లోక్ అదాలత్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తి నసీం సుల్తానా, జిల్లా లీగల్‌సెల్ అథారిటీ నిహారిక, గోపిక నాగశ్రావ్య, శృతిదూత పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
ఉప్పునుంతల: విధులల్లో నిర్లక్ష్యం చేసే డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంఆండ్‌హెచ్‌ఓ) డాక్టర్ కృష్ణ హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ను ఆయన తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయని, మరోసారి ఇలాగే కొనసాగితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్లు, సిబ్బంది విధులపై నిర్లక్ష్యం చేస్తున్నారని, అన్ని పరికరాలు ఉన్నా రోగులకు అవసరమైన పరీక్షలు చేయడం లేదని సర్పంచు సీహెచ్ శ్రీనివాసులు డీఎంఅండ్‌హెచ్‌ఓ దృష్టికి తెచ్చారు. సీహెచ్‌సీలో ఉన్న అన్ని రకాల టెస్టులను చేయాలని డాక్టర్లకు డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ తారాసింగ్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, డాక్టర్లు స్వప్న, బిక్కులాల్, జాన్సీ, శ్రీకాంత్, మోతీలాల్, సిబ్బది పాల్గొన్నారు.
నల్లమల అందాలు
తిలకించిన అడిషనల్ డీజీ
కొల్లాపూర్: రాష్ట్ర అడిషనల్ డీజీ అభిలాష బిస్తీ శనివారం కొల్లాపూర్‌లో పర్యటించారు. ఆమె సోమశిలలో కృష్ణానది అందాలను తిలకించి సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కొల్లాపూర్ పట్టణం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఏకో పార్కును, వ్యూ పాయింట్‌ను తిలకించారు. వ్యూ పాయింట్ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉందన్నారు. ఆమె వెంట అటవీ ఉద్యోగులు నవీన్, నిరంజన్, గోపాల్, అక్బర్ తదితరులు ఉన్నారు.
ఐటీడీఏ పీఓగా అదనపు కలెక్టర్ సలోనిచోప్రా
మన్ననూర్: స్థానికంగా నిర్వహణలో ఉన్న సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి (పీఓ)గా నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ సలోనిచోప్రా బాధ్యతలు స్వీకరించారు. శనివారం కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు ఐటీడీఏ ఏఓ జాఫర్ హుసేన్‌తో పాటు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఓగా బాధ్యతలు తీసుకున్న ఛాబ్రా పెండింగ్‌లో ఉన్న కొన్ని ఫైళ్లపై సంతకం చేశారు.
సాంకేతిక పరిజ్జానాన్ని అందిపుచ్చుకోవాలి
అచ్చంపేట రూరల్: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సబ్ కలెక్టర్ సలోనిచోప్రా అన్నారు. శనివారం పట్టణంలోని ఏయూపీఎస్‌లో సామాజిక సేవా కార్యకర్త సాదె రాజు సహకారంతో ఏర్పాటు చేసిన ఏఐ క్లా స్‌రూం, ఆర్‌ఓ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.


