కందనూలు: వ్యవసాయానికి కరెంటు కట్ చేసి రైతులను కష్టాలకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి అధికారాన్ని కట్ చేసేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలో కరెంటు కోతలపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్ నుంచి సబ్‌స్టేషన్ వరకు రైతులు, ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద గల సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల పాలిట శనిగా కాంగ్రెస్ సర్కార్ మారిందని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్నా.. నీటిని ఎత్తిపోయడానికి చేసిన నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతుల కొంప ముంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులతో తీవ్ర కరువు వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ముందే హెచ్చరించినా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర పోతుందని మండిడ్డారు.
కేఎల్‌ఐ మోటార్ల ప్రారంభంలో జాప్యం..
ఎగువ కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి ప్రతిరోజు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న క్రమంలో కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించాలని ఎంత చెప్పినా వినలేదు మాజీ మంత్రి ఆరోపించారు. కేఎల్‌ఐ ద్వారా 200 రోజులు మోటార్లు నడిపినా 40 టీఎంసీల నీరు ఎత్తిపోయడం సాధ్యం కాదని, కానీ ఆంధ్ర ప్రాజెక్టులకు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రతిరోజు 10 టీఎంసీల మేర నీటిని తరలించకుపోతుంటే రేవంత్ సర్కార్ కళ్లప్పగించి చూశారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 6 గ్యారంటీలు 420 హామీల్లో ఒక్కటి సక్రమంగా నెరవేర్చక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 420 సీఎంగా నిలిచారని ఆరోపించారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం ఇచ్చారు.


