కురుమూర్తి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.110 కోట్లతో పలు పనులు చేపడుతున్నారు. ప్రధాన ఆలయం వద్ద మహామండపం, జాతర మైదానంలో కల్యాణ మండపం, విడిది సత్రాలు, అన్నదాన సత్రాలు తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే రాజగోపురం వద్ద రేకుల షెడ్డు, కోనేరు సమీపంలో విడిది సత్రం, డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి.
మెట్ల కష్టాలకు చెక్
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి అమావాస్య, శని, సోమవారాల్లో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారు. అయితే వృద్ధులు, దివ్యాంగులు కొండపైకి మెట్లు ఎక్కలేక రాజగోపురం వద్ద నుంచే స్వామివారిని దర్శించుకుని వెనుదిరిగే పరిస్థితి ఉంది. ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వస్తే వాహనాల్లోనే ప్రధాన ఆలయం వరకు చేరుకునే అవకాశం కలగనుంది. దీంతో భక్తుల ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి.


