విద్యార్థుల ఆకలి తీరుస్తూ..
● ప్రభుత్వ పాఠశాల, విద్యార్థుల
అభివృద్ధికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులు
● వినూత్నంగా బోధనతో విద్యార్థుల
భవిష్యత్‌కు బంగారు బాటలు
● నూతన ఆవిష్కరణలు, సైన్స్ వైపు మరల్చేందుకు కృషి
● జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
కోడేరు మండలంలోని రాజాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు నాగిళ్ల శ్రీశైలం. పాఠశాల విద్యలో 26 ఏళ్లుగా విద్యను బోధిస్తూ తరగతి గదిలో జ్ఞాన ప్రసారం కాదు జ్ఞాన నిర్మాణం జరగాలనే ఆలోచనతో.. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేందుకు అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని రూపొందించారు. వీటి ఆధారంగా గత రెండేళ్లుగా విద్యార్థులకు ప్రదర్శన చేస్తూ జిల్లాలో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచారు. బోధన బొమ్మలాటలో భాగంగా లింగ సమానత్వంపై ప్రదర్శన చేసి రాష్ట్రంలో జిల్లాకు రెండో బహుమతి సాధించారు. దీక్ష పోర్టల్‌లో ఈ కాంటెంట్ క్రియేటర్‌గా ప్రాథమిక స్థాయి పరిసరాల విజ్ఞానంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేందుకు రూపొందించిన వీడియోలు ప్రస్తుత ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ రూపంలో అందుబోటులో ఉన్నాయి.
వంగూరు మండలంలోని తుమ్మలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు రెండేళ్లుగా ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందిస్తూ.. విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు ఉపాధ్యాయుడు కోటేశ్వర్‌రావు. ఈయన 2024లో పాఠశాలకు బదిలీపై వచ్చినప్పుడు 32 మంది విద్యార్థులు ఉండగా.. హెచ్‌ఎం సైదులు, ఉపాధ్యాయులు సునీత, కవితతో కలిసి పాఠశాల అభ్యున్నతికి పాటుపడుతూ 78 మంది విద్యార్థులను చేర్పించారు. అలాగే గ్రామ యువకులు, దాతల సహాయంతో పాఠశాలలో విద్యావలంటీర్‌ను ఏర్పాటు చేసి సాయంత్రం 5.30 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ బోధన అందిస్తున్నారు. గతేడాది జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై స్ఫూర్తిగా నిలిచారు.
– కందనూలు/ అచ్చంపేట


