యథేచ్ఛగా ఆక్రమణ.. నిర్మాణాలు! | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా ఆక్రమణ.. నిర్మాణాలు!

Sep 5 2026 6:31 AM | Updated on Sep 5 2026 6:31 AM

లోకాయుక్త, హైకోర్టులో కేసులున్నా ఆగని నిర్మాణాలు

నోటీసులు అందిస్తాం

పరిశీలించి చర్యలు

లోకాయుక్త, హైకోర్టులో రిట్‌లు

కల్వకుర్తి టౌన్‌: పట్టణంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రజా అవసరాల కోసం కేటాయించిన మున్సిపల్‌ స్థలాలు, జాతీయ రహదారి ఆస్తులు, బఫర్‌జోన్ల విషయంలో నిబంధనలు అమలవుతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేవరకొండ రోడ్డులోని ఓ వెంచర్‌ పరిధిలో ఇంటి నిర్మాణం పేరుతో జాతీయ రహదారి వెంట ఉన్న రక్షణ గ్రిల్‌ తొలగించడంతో పాటు కోల్‌బావి బఫర్‌జోన్‌ వద్ద రక్షణ గోడ కూల్చివేయడం, రోడ్డు స్థలంలో బేస్‌మెంట్‌ వేసి రేకుల షెడ్డు నిర్మించినట్లు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రజాస్థలంలో ఆక్రమణలు..

కల్వకుర్తి మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో సర్వే నంబర్‌ 99/3లో వెంచర్‌ ఏర్పాటు చేసి మొత్తం 38 ప్లాట్లు వేశారు. నిబంధనల ప్రకారం వెంచర్‌లో 10 శాతం స్థలాన్ని, సుమారు 757 గజాలను గ్రామపంచాయతీ అవసరాల కోసం కేటాయించినట్లు రికార్డులు, స్థానికులు చెబుతున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీగా మారిన తర్వాత ఈ భూమి మున్సిపాలిటీకి చెందినదేనని అప్పటి కమిషనర్‌ సాబేర్‌అలీ అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ అదే స్థలానికి కొత్త లేఔట్‌ రూపొందించి, కొత్త బై నంబర్లు కేటాయించి ప్రైవేటు వ్యక్తుల పేర్లతో చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్లాట్‌కు 160 గజాల స్థలం ఉండగా.. సంబంధిత డాక్యుమెంట్‌లో మాత్రం 225 గజాలు చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అదనంగా చూపిన 65 గజాలు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం 757 గజాల్లో ప్రస్తుతం సుమారు 200 గజాల వరకు మాత్రమే ఖాళీగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

జాతీయ రహదారి గ్రిల్‌ను తొలగించి చేపడుతున్న

ఇంటి నిర్మాణం

ఈ ఫొటోలో కనిపిస్తున్న షెడ్డు మున్సి పాలిటీ స్థలంలో ఏర్పాటు చేసింది. షెడ్డు నిర్మాణం చేసి, పక్కనే ఉన్న కోల్‌బావి కాల్వ బఫర్‌ జోన్‌ గోడ కూల్చి చదును చేసినా టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు కనపడలేదు.

జాతీయ రహదారి గ్రిల్‌ తొలగించి కోల్‌బావి బఫర్‌జోన్‌ గోడ ధ్వంసం

మున్సిపల్‌ రోడ్డు స్థలంలో

షెడ్డు నిర్మాణం

సామాన్యుడికి మాత్రం ఎక్కడా

లేని నిబంధనలు..

ప్రభుత్వ ఆస్తులపై

అధికారుల ఉదాసీనత

జాతీయ రహదారి వెంట ఏర్పాటు చేసిన గ్రిల్‌ను తొలగించడం పెద్ద తప్పిదం. గ్రిల్‌ తొలగించినట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తికి నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడతాం.

– కౌశిక్‌, ఏఈఈ, ఎన్‌హెచ్‌

దేవరకొండ రోడ్డులో నిర్మిస్తున్న ఇంటిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. మరోసారి స్థలాన్ని పరిశీలించి ఏవైనా ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే వెంటనే నోటీసులు జారీ చేస్తాం. నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలు వెంటనే తొలగిస్తాం.

– తనూజ,

టౌన్‌ప్లానర్‌, కల్వకుర్తి మున్సిపాలిటీ

మున్సిపాలిటీలోని ఈ భూమి వివాదం ఏళ్లుగా కొనసాగుతోంది. లోకాయుక్తలో కేసు నం.4291/2013/ఆ1 నమోదై ఉండగా.. హైకోర్టులో 38268/2022, 33952/2023 కేసులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. భూమి హక్కులు, యాజమాన్యం, ప్రజాస్థల పరిరక్షణకు సంబంధించిన అంశాలు న్యాయస్థానాల పరిధిలో ఉండటంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే అధికారులు తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు సైతం తమ ఆస్తి హక్కులు, ప్రజా స్థల పరిరక్షణకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. సామాన్యుడు ఇంటి నిర్మాణంలో చిన్నపాటి నిబంధన ఉల్లంఘించినా నోటీసులు, జరిమానాలు, అవసరమైతే కూల్చివేత చర్యలు తీసుకునే అధికారులు.. ప్రభుత్వ ఆస్తుల విషయంలో మాత్రం ఎందుకు అదేస్థాయిలో స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement