ఉప్పునుంతల: గ్రామైక్య మహిళా సంఘాలకు మంజూరు చేసిన వ్యవసాయ పొలాల్లో పాంపాండ్ (నీటి నిల్వ కుంట)ల పనులు వేగవంతం చేసి నిర్ధేశించి లక్ష్యం మేరకు పూర్తిచేయాలని డీఆర్‌డీఓ చిన్న ఓబులేసు అన్నారు. మంగళవారం మండలంలోని అయ్యవారిపల్లిలో ఈజీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫాంపాండ్ పనులను డీఆర్‌డీఓ పరిశీలించారు. మండలంలో 15 గ్రామైక్య మహిళా సంఘాలకు ఒక్కో గ్రామైక్య సంఘానికి రెండేసి చొప్పున మంజూరైన 30 ఫాంపాండ్‌లను త్వరితగతిన పూర్తిచేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీఓ వరుణ్‌తేజ, ఈజీఎస్ ఏపీఓ పర్వతాలు, ఐకేపీ ఏపీఎం బాలచంద్రుడుకు సూచించారు. అలాగే కూలీల సంఖ్య పెంచాలని, ఇప్పటికీ ప్రారంభించని గ్రామైక్య మహిళా సంఘాల మహిళలకు పాంపాండ్‌ల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచు జగత్‌రెడ్డి, ఈసీ కుర్మారెడ్డి, టీఏ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


