వద్దన్నా.. వినరే! | - | Sakshi
Sakshi News home page

వద్దన్నా.. వినరే!

Sep 4 2026 1:30 AM | Updated on Sep 4 2026 1:30 AM

మా పొలంలో పండేది వరిపంటే.. రైతులు వినడం లేదు.. సమీపిస్తున్న నమోదు గడువు.. కేఎల్‌ఐ కాల్వలకు నీటి విడుదలతో..

జిల్లాలో వరిసాగుకే మొగ్గు చూపిన రైతులు

మా పొలం వరిపంట సాగుకే అనుకూలం. అంతేకాకుండా కేఎల్‌ఐ కాల్వకు సాగునీరు వచ్చింది. బోర్లలో సైతం నీరు ఉన్నాయి. అందుకే వద్దన్నా వరిసాగు వేశాను. సన్నరకాలకు బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం కూడా వరిసాగుకు మొగ్గు చూపాను. పంట పండించడం సులువుగా ఉంటుంది.

– బాలస్వామి,

రైతు, అల్లాపూర్‌

ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు వద్దని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని జిల్లావ్యాప్తంగా ప్రచారం చేసినా రైతులు వినడంలేదు. లక్ష్యానికి 60 శాతానికి పైగా సాగు చేశారు. ఇక ప్రభుత్వం సన్న రకాలకు బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు.

– చంద్రశేఖర్‌, జిల్లా

వ్యవసాయశాఖ అధికారి

నాగర్‌కర్నూల్‌: ఎల్‌నినో ప్రభావంతో ఆరంభంలో వరిసాగు విషయంలో రైతులు ఆందోళన చెందారు. అధికారులు సైతం ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచించారు. వర్షాలు కురవవని, భూగర్భజలాలు తగ్గిపోతాయని హెచ్చరించారు. కాల్వ నీరు వచ్చినా పూర్తిస్థాయిలో విడదల చేయడం కష్టమేనని ఎన్నిసార్లు చెప్పినా రైతులు చివరికి వరిసాగుకే మొగ్గుచూపారు. వ్యవసాయాధికారులు మొదట్లో జిల్లావ్యాప్తంగా వానాకాలం వరిసాగు 1.90 లక్షల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించగా.. ఈసారి సగం కూడా కష్టమేనని భావించారు. తీరా రైతులు 1,30,137.30 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ లెక్కలో తేలడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. 68 శాతం విస్తీర్ణంలో సాగుచేయగా.. ఇందులోనూ సన్నరకాలకే రైతులు ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వం వాటికే రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో దొడ్డు వడ్లకు బదులు సన్నరకమే ఎక్కువగా నాటారు. 1,10,616 ఎకరాల్లో సన్నాలు సాగు చేశారని వ్యవసాయ గణాంకాల్లో తేలింది. వరిసాగుతో మొత్తం 3,86,507.78 మె.ట., దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం వానాకాలంలో ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నాలు సాగుచేస్తేనే బోనస్‌ వస్తుంది. రైతులు టీ–అగ్రిసీడ్స్‌ పోర్టల్‌లో నమోదు చేసుకుంటేనే క్వింటాకు రూ.500 బోనస్‌ వారి ఖాతాల్లో జమవుతుంది. అందుకు ఈ నెల 10లోగా విత్తన వివరాల నమోదు చేయాలి. విత్తనాలు విక్రయించిన డీలర్లు రైతు పేరు, మొబైల్‌ నంబర్‌తో పాటు, విత్తన రకం..? ఎన్ని బస్తాలు..? కంపెనీ పేరు..? లాట్‌, బిల్‌ నంబర్‌ తదితర వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ నమోదు చేయాల్సి ఉంటుంది.

ల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాబావ పరిస్థితుల నెలకొన్నా ఎగువన కురిసిన వర్షాలతో వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి రావడంతో రైతుల్లో ధైర్యం వచ్చింది. కేఎల్‌ఐ నీరు విడుదల చేయడంతో భయపడాల్సిన అవసరం లేదని నమ్మకంతో వరిసాగుకు మొగ్గుచూపారు. దీంతో వరిసాగుపై అధికారులు అంచనాలు తలకిందులైంది. 1.90లక్షల సాగుకు మందుగా లక్ష్యంగా పెట్టుకున్నా రైతులు ఆస్థాయిలో సాగు చేయకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో 1.30లక్షల ఎకరాల్లో సాగు చేయడం ఆశ్చరం. శ్రీశైలం ప్రాజెక్టులో రోజురోజుకు నీరు తగ్గిపోతుంది. దీంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వార సాగు నీరు పంట చేతికొచ్చేవరకు నీరు వస్తుందా అన్న అనుమానం తలెత్తుతుంది. నీరు రాకపోతే వరిసాగు పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉంటుంది.

వరిసాగు: 1,30,137.30 ఎకరాలు

దిగుబడి అంచనా: 3,86,507.78

మెట్రిక్‌ టన్నులు

సన్నాల దిగుబడి: 3,31,850.12

మెట్రిక్‌ టన్నులు

ఆరంభంలో వెనకాడినా..

కేఎల్‌ఐ నీటి విడుదలతో ప్రాధాన్యం

ప్రభుత్వం ఎంత హెచ్చరించినా 68శాతం పంట

శ్రీశైలంలో రోజురోజుకూ తగ్గిపోతున్న నీటిమట్టం

చివరికి చేతికొస్తుందో.. లేదోనని సందిగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement