ఎట్టకేలకు విచారణ! | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు విచారణ!

Sep 3 2026 8:53 AM | Updated on Sep 3 2026 8:53 AM

ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వీరే..

నాగర్‌కర్నూల్‌ పురపాలికలో రూ.1.26కోట్లు పక్కదారి

మూడు జీవోలు విడుదల..

సిబ్బంది వేతనాల్లో

దుర్వినియోగం..

కోర్టు కేసుతో..

నాగర్‌కర్నూలు/అచ్చంపేట: జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పురపాలికలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన నిధుల గోల్‌మాల్‌పై గతంలోనే ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ‘సాక్షి’ కథనానికి మరింత బలం చేకూరింది. అయితే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాల్లో ఎవరి ప్రమేయం ఎంత ఉందనే దానిపై అప్పట్లో సీడీఎంఏకు నివేదిక పంపించారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. అప్పటి నుంచి దాచి ఉంచిన నివేదికను ప్రస్తుతం బయటకు తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

2021 జనవరి నుంచి 2024 నవంబర్‌ వరకు మున్సిపాలిటీలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నెలవారీ వేతనాల చెల్లింపుల్లో సుమారు రూ.1,26,51,946 మేర దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. అయితే నిధుల గోల్‌మాల్‌లో మున్సిపల్‌ మాజీ కమిషనర్‌ బి.నరేశ్‌బాబుతో పాటు మొత్తం 8 మంది అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మున్సిపాలిటీలో నిధులు పక్కదారి పట్టిన విషయంలో 8మంది అధికారుల హస్తం ఉన్నట్లు రెండేళ్ల క్రితమే వెలుగు చూసింది. 2021 నుంచి 2024 మధ్యకాలంలో ఇక్కడ పనిచేసిన మున్సిపల్‌ కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో సమగ్ర విచారణ జరపకపోవడం.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో బి.నరేశ్‌బాబు (అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ (ప్రస్తుతం దేవరకద్ర మున్సిపల్‌ కమిషనర్‌)

డి.శ్రీలత అప్పటి మాజీ జేఏవో (ప్రస్తుతం మల్కాజిగిరి జోనల్‌ ఆఫీస్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌)

జి.అన్వేష్‌ అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ (ప్రస్తుతం మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌)

జి.యాదయ్య అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ (ఎఫ్‌ఏసీ) (ప్రస్తుతం కోస్గి మున్సిపల్‌ మేనేజర్‌)

కె.జయంత్‌కుమార్‌రెడ్డి అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ (ప్రస్తుతం స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు)

ఎండీ అబ్దుల్‌ సలాం అప్పటి మేనేజర్‌ (ప్రస్తుతం ఎల్లంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు)

డి.మురళి అప్పటి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, (ప్రస్తుతం అచ్చంపేట మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు)

కె.రాములు అప్పటి జూనియర్‌ అసిస్టెంట్‌ (పదవీ విరమణ పొందారు)

వీరిలో ప్రధానంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, ఎఫ్‌ఏసీ కమిషన్‌ (మేనేజర్‌) ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

విచారణకు సంబంధించి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌శాఖ మూడు జీవోలను విడుదల చేసింది. గత జూలై 31న వెల్లువడిన జీవో నం. 742 ప్రకారం ఉమ్మడి విచారణ ద్వారా ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం 8 మంది ఉద్యోగులపై తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ (సీసీఏ) నిబంధనల ప్రకారం 1991 రూల్‌ 24 కింద ఉమ్మడి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వమే క్రమశిక్షణా అధికారిగా వ్యవహరిస్తుందని.. నిబంధనల ప్రకారం జరిమానాలు విధించే అధికారాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. ఇక గత జూలై 31న రెండో జీవో 743 ప్రకారం ఈ కేసులో నిబంధన 20 ప్రకారం రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ ఎ.మారుతి ప్రసాద్‌ విచారణాధికారిగా నియమించారు. ఆయన నెలరోజుల్లో నివేదిక ఇవ్వకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. అదే రోజు మూడో జీవో 744 ప్రకారం క్రమశిక్షణ అధికారి తరఫున అభియోగాలను విచారణాధికారి ముందు ఉంచడానికి ప్రస్తుత నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ను ప్రెజెంటింగ్‌ ఆఫీసర్‌గా నియమించారు. ఈ విషయంపై ప్రస్తుత కమిషనర్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.

నిధుల దుర్వినియోగంలో పాత్ర ఉందని భావిస్తున్న అప్పటి జూనియర్‌ అసిస్టెంట్‌ కె.రాములు రిటైర్డ్‌మెంట్‌ తర్వాత బెనిఫిట్స్‌ నిలిచిపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఎందుకు బెనిఫిట్స్‌ నిలపుదల చేశారో వివరణ ఇవ్వాలని హైకోర్టు సీడీఎంఏను కోరడంతో.. నిధుల గోల్‌మాల్‌ అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల్లో

చేతివాటం

సమగ్ర విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

8మంది అధికారులపై ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement