కందనూలు: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీజీ విగ్రహం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలతో ప్రజలను నమ్మించి.. అధోగతి పాలుజేసిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి, కొట్లాట పెట్టారని.. మిగతా ఏ ఒక్క గ్యారంటీని కూడా సక్రమంగా అమలుచేసిన పాపాన పోవడం లేదని దుయ్యబట్టారు. రైతుభరోసా రూ. 15వేలు, చేయూత పింఛన్ పెంపు ఏమైందని ఆయన ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తుండగా.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రైతులకు సాగునీరు అందిస్తే ఎరువులు అడుగుతారని.. ఆ తర్వాత పంట మద్ధతు ధరకు కొనకపోతే బీఆర్‌ఎస్ వారు ధర్నాలు చేస్తారని.. పండించిన పంటకు బోనస్ ఇవ్వాల్సి ఉంటుందని ఉద్దేశపూర్వకంగానే సాగునీరు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆటో కార్మికులకు సైతం ప్రతినెలా రూ. 2వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. 33 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


