కందనూలు: బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సాఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన చేసి.. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగు, సాగునీటి కొరత తీర్చిన ఘనత మహానేతకే దక్కుతుందని కొనియాడారు. వైఎస్సార్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


