కందనూలు: సంచార జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సంచార జాతుల చరిత్ర, వారు ఎదుర్కొన్న సామాజిక పరిస్థితులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో వివిధ కారణాలతో సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా వారి పిల్లలకు మెరుగైన భవిష్యత్ అందించవచ్చన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. సంచార జాతుల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే.. వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సహాయ అధికారి శ్రీరాములు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు..
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి.. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 64 ఆర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవ సహాయం, డీఆర్వో పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.


