కందనూలు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టే పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఆర్‌ఎస్ నేత డా.నాగం శశిధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలను ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల విషయంలో తాత్సారం చేయడం సరైంది కాదని అన్నారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని గుర్తుచేశారు. ఇప్పటికై నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అర్థం రవి, బాలాగౌడ్, కౌన్సిలర్ అర్జునయ్య, భీముడు, సత్యం ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గ్రూప్–1, 2 ,3, 4 పరీక్షలకు సిద్ధమయ్యే మైనార్టీ వర్గాలకు చెందిన డిగ్రీ పాసైన యువతకు జనరల్ స్టడీస్‌లో ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి విష్ణునందన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీపీఎల్ కేటగిరీ కింద అర్హులైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు మంగళవారం నుంచి 14 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, ఇందిర ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రాంగణం, ఎంఏఎం క్యాంపస్, ఇంటర్మీడియట్ బోర్డు వెనుక, శ్రీబాలాజీ ఎన్‌క్లేవ్, నాంపల్లి, హైదరాబాద్ అనే చిరునామాకు పంపుకోవాలన్నారు. ఎంపికై న వంద మందికి అక్కడే సెప్టెంబర్ 15 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.


